రాష్ట్రంలో స్పీడ్ గా సెకండ్ వేవ్..

రాష్ట్రంలో స్పీడ్ గా సెకండ్ వేవ్..

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, నిజామాబాద్‌లో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. మిగతా జిల్లాల్లోనూ రోజూ 8 నుంచి 10 ప్రాంతాల్లో కేసులు బయటపడుతున్నాయి. వీటిల్లో ఒక్కో దగ్గర 10 నుంచి 30 కేసులు నమోదవుతున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,  మున్ముందు కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. బుధవారం 887 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లో 201, మేడ్చల్‌లో 79, నిర్మల్‌లో 78, రంగారెడ్డిలో 76, జగిత్యాలలో 56, నిజామాబాద్‌లో 45 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో 40 కంటే తక్కువ కేసులు వచ్చాయన్నారు. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,08,776కు చేరిందని.. ఇందులో 3,01,564 మంది కోలుకున్నారని తెలిపారు. హాస్పిటళ్లలో కరోనా పేషెంట్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. బుధవారం నాటికి రాష్ర్టంలో 5,511 యాక్టివ్ కేసులుండగా ఇందులో 3,345 (60 శాతం) మంది హాస్పిటళ్లలోనే ఉన్నారు. 

వీళ్లలో 1,839 మంది సీరియస్‌ కండీషన్‌లో ఆక్సిజన్‌, వెంటిలేషన్‌ సపోర్ట్‌తో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు. బుధవారం కరోనాతో నలుగురు చనిపోయినట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. వీరితో కలిపి మృతుల సంఖ్య 1,701కి పెరిగినట్టు చూపించారు. అయితే బుధ, గురువారాల్లో కలిపి ఒక్క గాంధీలోనే నలుగురు కరోనా పేషెంట్లు మృతి చెందినట్టు అక్కడి డాక్టర్లు తెలిపారు. ఈ నలుగురు కాకుండా మరో 11 మంది నాన్ కోవిడ్ పేషెంట్లు మృతి చెందారన్నారు. ఈ 11 మంది కూడా కరోనా పేషెంట్లేనని జరిగిన ప్రచారాన్ని హెల్త్ ఆఫీసర్లు ఖండించారు.

1,120 సెంటర్లలో వ్యాక్సినేషన్‌

రాష్ట్రంలో గురువారం నుంచి 45 ఏండ్లు దాటిన వాళ్లకు వ్యాక్సినేషన్‌ మొదలైంది. ఇదివరకు 45 ఏండ్లు దాటి ఏదైనా జబ్బు ఉన్నవాళ్లకే వ్యాక్సిన్ వేసేవారు. తాజాగా కేంద్రం సూచనలతో ఏ జబ్బూ లేకున్నా 45 ఏండ్లు దాటినోళ్లకు వ్యాక్సిన్ వేస్తున్నారు. గురువారం 875 ప్రభుత్వ, 245 ప్రైవేట్‌ సెంటర్లలో వ్యాక్సినేషన్ నిర్వహించారు. వీటిల్లో 45,654 మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో రాష్ర్టంలో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ల సంఖ్య 10,74,575కు పెరిగింది.