దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. డేంజ‌ర్ జోన్ లోకి మ‌హారాష్ట్ర‌..

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. వేగంగా ప్ర‌పంచ దేశాల‌న్నింటికీ వ్యాపిస్తోంది. ఇప్ప‌టికే 4 ల‌క్ష‌ల 80 వేల మంది ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ‌గా.. 21,500 మంది దీనికి బ‌ల‌య్యారు. భార‌త్ లోనూ దీని వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. దేశంలో 27 రాష్ట్రాలు/కేంద్రంపాలిత ప్రాంతాల్లో ఈ వైర‌స్ విస్త‌రించింది. గుర‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల స‌మ‌యానికి ఒక్క రోజులో 37 కొత్త కేసులు పెరిగి.. దేశ వ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 695కు చేరింది. ఇందులో 45 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 14 మంది మ‌ర‌ణించారు.

మ‌హారాష్ట్ర డేంజ‌ర్ జోన్ లోకి..

దేశం మొత్తంలో మ‌హారాష్ట్రలో వేగంగా కేసులు పెరిగుతున్నాయి. ఈ రాష్ట్రం క్ర‌మంగా డేంజ‌ర్ జోన్ లోకి వెళ్తోంది. మార్చి 9న ఇక్క‌డ తొలి కేసు న‌మోదు కాగా.. ఆ రోజు నుంచి కేవ‌లం 17 రోజుల్లోనే మొత్తం కేసుల 125కు చేరింది. ఇందులో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా.. ఒక పేషెంట్ పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఈ రాష్ట్రం క‌న్నా ముందే కేసులు న‌మోదైన తెలంగాణ‌, రాజ‌స్థాన్, హ‌ర్యానా, యూపీ కొంత మేర వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డంలో విజ‌యం సాధించాయి. ఇక మ‌హారాష్ట్ర త‌ర్వాత కేర‌ళలో భారీ సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక్క‌డ తొలి కేసు జ‌న‌వ‌రి 30నే న‌మోదు కాగా.. ఇవాళ సాయంత్రానికి మొత్తం 118 మందికి క‌రోనా సోకింది. ఇందులో ఆరుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా మార్చి 23న అత్య‌ధికంగా 102 కేసులు న‌మోదు కాగా… ఆ త‌ర్వాత కొంత‌మేర త‌గ్గుముఖం ప‌ట్టాయి. మార్చి 24న 66 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. నిన్న (25న‌) 86 మందికి, ఇవాళ 37 మందికి క‌రోనా సోకింది. అయితే దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తి రోజురోజుకీ కంట్రోల్ లోకి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Latest Updates