ఢిల్లీ మ‌ర్క‌జ్ ఘ‌ట‌నకు దురుద్దేశాలు అంట‌గ‌ట్టొద్దు

క‌రోనాపై భార‌తీయులంతా ఒక్క‌టిగా పోరాడాల‌ని పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఢిల్లీ మ‌ర్క‌జ్ ఘ‌ట‌న‌కు దురుద్దేశాలు ఆపాదించొద్ద‌ని, క‌రోనా కాటుకు కులం, మ‌తం, ప్రాంతం అన్న తేడాలు లేవ‌ని అన్నారు. మ‌ర్క‌జ్ త‌బ్లిగీ జ‌మాత్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొని తిరిగి వ‌చ్చిన వారికి క‌రోనా సోక‌డం దుర‌దృష్టంగా భావించాల‌ని చెప్పారు. మ‌న‌వాళ్ల‌నే మ‌నం వేరుగా చేసి ద్వేషించ‌కూడ‌ద‌ని, క‌రోనా బాధితుల‌కు ఆప్యాయ‌త పంచాల‌ని పిలుపునిచ్చారు సీఎం జ‌గ‌న్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ లో జ‌రిగిన మ‌త స‌ద‌స్సుకు వ‌చ్చిన విదేశీ ప్ర‌తినిధుల్లో కొంద‌రికి క‌రోనా ఉండ‌డంతో అక్క‌డికి వెళ్లిన మ‌న వాళ్ల‌కు ఆ వైర‌స్ సోకింద‌ని అన్నారు జ‌గ‌న్. ఇది ఏ మ‌తానికి సంబంధించిన కార్య‌క్ర‌మంలోనైనా జ‌ర‌గొచ్చ‌ని, అన్ని మ‌తాల్లోనూ దేశ విదేశాల్లో భ‌క్తులు, ప్ర‌తినిధులు ఉన్నార‌ని చెప్పారు. మ‌ర్క‌జ్ కు వెళ్లిన వారికి క‌రోనా రావ‌డం ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగిన ఘ‌ట‌న‌గా కాకుండా దుర‌దృష్టక‌ర‌ ఘ‌ట‌న‌గా చూడాల‌ని కోరారు. మ‌నమంతా కంటికి క‌నిపించ‌ని శ‌త్రువైన వైర‌స్ తో పోరాడుతున్నామ‌ని, ఈ యుద్ధంలో మ‌న వాళ్ల‌పైనే ఏదో ఒక చెడు ముద్ర వేయొద్దని పిలుపునిచ్చారు.

అంతా ఒక్క‌టిగా ఉన్నామ‌ని చాట‌డానికే ప్ర‌ధాని పిలుపు

దేశ ప్ర‌జ‌లంతా ఒక్క‌టిగా ఉన్నామ‌న్న ఐక్య‌త‌ను చాట‌డానికి ప్ర‌ధాని మోడీ ఆదివారం నాడు రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు కుల‌మ‌త ప్రాంతాలు అన్న తేడా లేకుండా దీపాలు వెలిగించాల‌ని పిలుపునిచ్చార‌ని చెప్పారు సీఎం జ‌గ‌న్. దీపాలు లేదా క్యాండిల్ వెలిగించ‌డం ద్వారా లేదా టార్చ్ లైట్, ఫోన్ ఫ్లాష్ లైట్ వేసి క‌రోనా చీక‌ట్ల‌ను త‌రుముతూ వెలుగుల‌ను నింపాల‌ని కోరారు.

వాళ్ల‌కు పూర్తి జీతాలు..

క‌రోనా వైర‌స్ పై ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడుతున్న‌వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికుల‌కు పూర్తి జీతాలు అందించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు సీఎం జ‌గ‌న్. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా మిగిలిన డిపార్ట్ మెంట్ల‌కు జీతాలు కొంత మేర వాయిదా వేశామ‌ని చెప్పారు.

Latest Updates