డాడీ.. ఊపిరి ఆడుతలేదు.. ఆక్సిజన్‌‌ తీసేసిన్రు.. ఇక సచ్చిపోతున్న బై..

హాస్పిటల్‌ బెడ్ మీది నుంచి యువకుడి సెల్ఫీ వీడియో
ఆ తర్వాత గంటకే మృతి
ఈ నెల 25న అర్ధరాత్రి చెస్ట్ హాస్పిటల్‌‌లో ఘటన
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని మృతుడి తండ్రి ఆరోపణ
సడెన్ హార్ట్స్ట్రోక్ వల్లే చనిపోయాడన్నసూపరింటెండెంట్

హైదరాబాద్, వెలుగు: ‘నాకు ఊపిరి ఆడడం లేదు డాడీ.. 3 గంటల నుండి బతిమాలుతున్నా నన్నెవరూ పట్టించుకుంటలేరు. ఆక్సిజన్ కూడా తీసేసిన్రు.. శ్వాస ఆడ్తలేదన్నా పెడ్తలేరు.. నా గుండె ఆగిపోయింది.. ఇగ నేను సచ్చిపోతున్న.. బై డాడీ’ అంటూ మరణానికి గంట ముందు, హాస్పిటల్‌‌ బెడ్‌పై ఉండి ఓ యువకుడు తన తండ్రికి పంపిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. హైదరాబాద్‌‌లోని చెస్ట్ హాస్పిటల్‌‌లో ఈ నెల 25న అర్ధరాత్రి ర్వాత జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ప్రభుత్వ దవాఖాన్ల దుస్థితికి ఆ వీడియో అద్దం పడుతోంది. హైదరాబాద్‌‌ జవహర్‌‌‌‌నగర్‌‌లోని బీజేఆర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన రవికుమార్‌‌‌‌(34)కు ఈ నెల 23న జ్వరం స్టార్ట్ అయింది. తండ్రితో కలిసి స్థానిక ప్రైవేటు హాస్పిటల్‌‌కు వెళ్తే జ్వరానికి సంబంధించి ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించారు. 24న జ్వరం ఎక్కువ కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుండడంతో, అతడ్నితీసుకుని తండ్రి 4 ప్రైవేటు హాస్పిటళ్లు, రెండు ప్రభుత్వ దవాఖాన్లు తిరిగినా ఎవరూ అడ్మిట్ చేసుకోలేదు. చివరకూ చెస్ట్ హాస్పిటల్‌‌లో అడ్మిట్ చేసుకున్నా.. సరైన ట్రీట్‌‌మెంట్ అందక బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. తాను అనుభవిస్తున్న నరకాన్ని చనిపోయే గంట ముందు రవికుమార్ తన తండ్రికి సెల్ఫీ వీడియో తీసి పంపాడు. అయితే.. అక్కడి అధికారులు మాత్రం సడెన్ హార్ట్స్ట్రోక్ వల్లే చనిపోయాడని, డాకర్ట నిర్లక్ష్యం లేదని అంటున్నారు.

ఆడికి ఈడికి తిప్పిన్రు: రవికుమార్ తండ్రి
‘ నా కొడుకు‌‌కు జ్వరం ఎక్కువ కావడంతో బుధవారం పొద్దున ఈసీఐఎల్‌‌లోని ప్రైవేటు హాస్పిటల్‌‌కు పోయినం. అక్కడ గేట్‌‌‌‌దగ్గరే ఆపి కరోనా లక్షణాలు ఉన్నయని అడ్మిట్ చేసుకోలేదు. ఇంకో హాస్పిటల్‌‌‌‌కు పోతే కరోనా టెస్ట్ చేయించుకు రావాలన్నరు. విజయా డయాగ్నసిస్‌‌‌‌కు వెళ్లి టెస్ట్ శాంపిల్ ఇచ్చినం. రిజల్ట్ రావడానికి రెండ్రోజులు పడుతుందన్నరు. అక్కడి నుండే సికింద్రాబాద్‌‌‌‌ సన్‌‌‌‌షైన్‌ ‌‌‌హాస్పిటల్‌‌‌‌కు వెళ్లాం. వాళ్లు కూడా అడ్మిట్ చేసుకోలేదు. తర్వాత జూబ్లిహిల్స్‌ ‌‌‌అపోలో హాస్పిటల్‌‌‌‌కు వెళ్లాం. ఐదు లక్షలైనా డిపాజిట్ చేస్త, నా కొడుకుకు ట్రీట్‌‌‌‌మెంట్ ఇవ్వండి అని బతిమాలినా ఎవరూ కనికరించలేదు. అక్కడి నుంచి నిమ్స్‌‌‌‌కు వెళ్లాం. కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నరు. శాంపిల్ ఇచ్చినం, రిజల్ట్ రాలేదని చెప్పినం. రిజల్ట్ నెగెటివ్ వస్తేనే అడ్మిట్ చేసుకుంటం.. లేదంటే గాంధీ దావాఖానకు వెళ్లండి అన్నరు. గాంధీ దవాఖానకు వెళ్తే, గేట్ దగ్గరే పోలీసులు ఆపిన్రు. పాజిటివ్ రిపోర్ట్‌‌‌‌ లేదని చెబితే, చెస్ట్ హాస్పిటల్‌‌‌‌కు వెళ్లండన్నరు. అప్పటికే సాయంత్రం ఏడు అయితున్నది. చెస్ట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్ చేసుకున్నరు. నేను హాస్పిటల్ బయట చెట్లకిందే ఉన్న. ట్రీట్‌‌‌‌మెంట్ సరిగ్గా చేస్తలేరని, పట్టించుకుంటలేరని నాకొడుకు నాకు ఫోన్‌‌‌‌లో చెప్తూనే ఉన్నడు. నాకు ఏంచేయాల్నో తోచలె. గురువారం రాత్రి 12.30 గంటలకు .. నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. చనిపోతున్నానంటూ వాట్సప్‌‌‌‌లో వీడియో పెట్టిండు. అది నేను రెండు గంటలకు చూసుకున్న. చూసిన వెంటనే హాస్పిటల్‌‌‌‌లోకి ఉరికిన. నీ కొడుకు చనిపోయిండు శవాన్ని తీసుకెళ్లు అని అక్కడోళ్లు చెప్పిన్రు’అంటూ రవికుమార్ తండ్రి వెంకటేశ్‌‌‌ ‌కన్నీరు పెట్టుకున్నారు.

నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
డాక్టర్ల నిర్లక్యం వల్లే తన కొడుకు రవికుమార్ చనిపోయాడని వెంకటేశ్ ఆరోపించారు. బుధవారం రాత్రి 7 గంటలకు అడ్మిటైన పేషెంట్‌‌‌‌కు కనీసం సీటీ స్కాన్ కూడా తీయించలేదని ఆయన అన్నారు. గుండె పోటు వచ్చి చనిపోయిండని ఎలా నిర్ధారించారో చెప్పాలని డాకర్ట్లను ప్రశ్నించారు.తన కొడుక్కు ఇదివరకు అనారోగ్య సమస్యలేవీ లేవన్నారు. చనిపోయాడని రాత్రి 2 గంటలకు చెప్పారని, అప్పుడే శవాన్ని తీసుకెళ్లాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. తెల్లారే వరకూ ఆగాలని అడిగితే, మార్చురీలో శవాలను ఎలుకలు, పంది కొక్కులు పీక్కుతింటున్నాయని అక్కడి సిబ్బంది హెచ్చరించారని అన్నారు. ఈ నెల 26న ఉదయం శవాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశామని, 27న ఉదయం వైరస్ పాజిటివ్ ఉన్నట్టు విజయా డయాగ్నసిస్ నుంచి రిపోర్ట్ వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికీ తమకు టెస్టులు చేయలేదని, తమ కొడుకు లాగే తమకు అయితే పట్టించుకునేవారు ఎవరని వెంకటేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయమై చెస్ట్‌‌‌‌ హాస్పిటల్‌ ‌‌‌సూపరింటెండెంట్‌‌‌‌, డాక్టర్‌ ‌‌‌మహబూబ్‌ఖాన్‌‌‌‌ను ‘వెలుగు’ సంప్రదించింది. శ్వాస ఆడడం లేదన్న పేషెంట్‌‌‌‌కు సీటీ స్కాన్‌‌‌‌, ఎక్స్‌‌‌‌రే ఎందుకు చేయలేదని ప్రశ్నించగా.. ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు.

ఒక్కోసారి ఆక్సిజన్ పెట్టినా శ్వాస అందదు
బాధితుడికి అవసరమైన ట్రీట్‌‌మెంట్ అందించాం. ఆక్సిజన్ సాచురేషన్‌‌ కరెక్ట్‌‌గానే మెయింటెయిన్ అయింది. అతడికి ఆక్సిజన్‌‌ తీసేయలేదు. కొన్నిసార్లు ఆక్సిజన్ పెట్టినప్పటికీ శ్వాస అందదు. రవికుమార్ కు కూడా అలాగే జరిగింది. అతడికి సడెన్‌‌గా రాత్రి హార్ట్ స్ర్టోక్‌‌ రావడం వల్లే చనిపో యాడు. ఈ మధ్య కరోనా పేషెంట్లకు సడెన్‌‌గా హార్ట్ స్ర్టోక్‌‌ వస్తోంది. ఇతనికి కూడా వస్తుందేమోనని ముందే ఊహించి, మెడిసిన్ కూడా ఇచ్చినం. ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యమేమీ లేదు.
– డాక్టర్ మహబూబ్‌ఖాన్,
చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్

For More News..

ఆన్ లైన్ క్లాసులపై గందరగోళం

Latest Updates