అడ్డగోలుగా అంబులెన్స్ రేట్లు..బస్సుల్లో కరోనా పేషెంట్లు

పాజిటివ్ పేషెంట్ల ప్రయాణంతో పెరుగుతున్న వైరస్
అప్ అండ్ డౌన్ చేసే వారికి అంటుతోంది..
అలర్ట్ గా ఉండాలంటున్న డాక్టర్లు

జనగామ, వెలుగు : కరోనా పాజిటివ్ పేషెంట్లు ఇష్టారీతిన బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. పాజిటివ్లను సిక్రేట్ గా ఉంచుతుండడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు. తెలిసి కొందరు ప్రయాణిస్తున్నా.. అంబులెన్స్ల భారం మోయలేక మరికొందరు చౌక ప్రయాణం చేస్తున్నారు. పాజిటివ్ ఉన్న సంగతి పక్కవాడికి కూడా తెలియడం లేదు. ఫలితంగా వైరస్ వ్యాప్తి మరింత వేగంగా జరుగుతోంది. కరోనా బారిన పడుతున్న ఉద్యోగులే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్, హన్మకొండ తదితర ప్రాంతాల నుంచి డైలీ బస్సుల్లో అప్ అండ్డౌన్ చేస్తున్న వారు ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్నట్లు ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. ట్రావెల్ హిస్టరీ ఆధారంగా బస్సు ప్రయాణాల్లోనే అంటించుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో బస్సులు, ఆటోల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది . కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో ఇవి కోవిడ్ హాట్ స్పాట్లుగా తయారవుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

బస్సుల్లోనే ఎఫెక్ట్..

ఉద్యోగం.. తదితర పనుల మీద నిత్యం బస్సుల్లో అప్ అండ్ డౌన్ చేస్తున్న వారు కోవిడ్ పాజిటివ్ కు గురవడం ఆందోళన కలిగిస్తోంది. జనగామ జిల్లాలోని వ్యవసాయ శాఖ జిల్లా ఆఫీస్లో పనిచేసే ఓ ఆఫీసర్కు జులైలో పాజిటివ్ వచ్చింది. అతడు రోజూ హై దరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడు. బస్సు ప్రయాణం ద్వారానే అతడికి వైరస్ అంటుకుందని డాక్టర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇటీవల జనగామ పోలీస్ స్టేషన్ తోపాటు, జిల్లాలోని అప్ అండ్ డౌన్ చేసే పోలీసులు 40 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఎక్కువ మంది పోలీసులు డైలీ బస్సు ప్రయాణం చేయడంతో వారికి పాజిటివ్ వచ్చి ఉంటుందని ఆఫీసర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్క వాడికి ఎటువంటి అనుమానం రాకుండా పేషెంట్లు బస్సులు ఎక్కుతుండడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. బస్సుల్లో మొదట్లో శానిటైజేషన్ పై శ్రద్ధచూపిన ఆఫీసర్లు ఇప్పుడు పెద్దగా పట్టిం చుకోవడం లేదు. ఎవరి జాగ్రత్తలు వారే తీసుకోవాలని చెప్పి వదిలేయడం వైరస్ వ్యాప్తికి కారణంగా మారుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.

అంబులెన్స్లకు దూరం

కోవిడ్ పేషెంట్లుఅంబులెన్స్లనే వాడాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పీపీఈ కిట్లు, తదితర ఖర్చులు ఉంటాయని చెబుతూ దాదాపుగా మూడు రెట్లకు అటు ఇటుగా అంబులెన్స్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఖర్చును భరించలేని పేదలు పక్కకు వెళ్లి ఇష్టారీతిన తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఉదాహరణకు జనగామ నుంచి 55 కిలోమీటర్లదూరం ఉండే వరంగల్ ఎంజీఎంకు రూ .10 నుంచి 12 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఈ ధర రూ 3,500లుగా ఉంటుంది. ఇక హైదరాబాద్ కు సాధారణ రోజుల్లోరూ 4,500లు ఉండగా ఇప్పుడు రూ.15 వేల పైన చార్జ్ చేస్తున్నారు. ఇటీవల కరోనా కేసులు మరింత పెరుగుతుండడంతో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు సైతం వెనకడుగు వేస్తున్నారు. ఒకరిద్దరు మినహా మిగిలిన వారు కోవిడ్ పేషెంట్ల తరలింపుకు జంకుతున్నారు. ప్రైవేటు అంబులైన్స్ ల్లో డ్రైవర్ సీట్ పార్టిషన్ చేసి ఉండదు. ఈ కారణంగా వారికి కరోనా సోకే అవకాశం ఉందని భయపడుతున్నా రు. అంతో ఇంతో ధైర్యం చేస్తున్న అంబులెన్స్ లు పైసల వసూళ్లకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ కారణంగా వీటికి పేషంట్లు దూరంగా ఉంటూ బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్లు మాత్రమే ఖర్చు భరిస్తూ వెళ్తున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
కరోనా పేషెంట్ల యథేచ్ఛ ప్రయాణానికి ప్రభుత్వ నిరక్ష్య్ల మే కారణం. కరోనా ఆరంభంలో అనుమానం ఉంటే అంబులెన్స్ లోనే ఇంటి వద్దకు వెళ్లేవి. అక్కడి నుంచి హాస్పిటల్ కు తీసుకెళ్లి టెస్టులు చేసి నిర్ధారణ చేసేవారు. పాజిటివ్ వస్తే ట్రీట్ మెంట్ ఇవ్వడం.. లేదంటే ఇంటికి పంపడం చేసేవారు. పాజిటివ్ పేషెంట్ల ప్రైమరీ కాంటాక్టులను హోం క్వారంటైన్ చేసేవారు. ముద్రవేసే వారు. కానీ ఇప్పుడు ప్రైమరీ కాంటాక్టులు లేవు. పేషెంట్లకు ముద్ర వేయడమూ లేదు. జనమే ‘‘మాకు అనుమానం ఉంది.. టెస్టులు చేయండి ’’అని వైద్య సిబ్బందికి మొర పెట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో వారు బస్సులు, ఆటోల్లో జిల్లా హాస్పిటల్ లకు, పీహెచ్సీ సెంటర్ లకు వస్తున్నారు. క్యూ లైన్ లలో ఉండి టెస్టులకు శాంపిల్స్ ఇస్తున్నారు. సెల్ నెంబర్ లకు మెసేజ్ వస్తుందని సిబ్బంది చెప్పడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చిన వారు తిరిగి తమ సొంత ఊళ్లకు సాదా సీదాగా అందరితో కలిసే ప్రయాణం చేస్తున్నారు. ఈ కారణంగా వైరస్ మ‌రికొందరికి అంటుకుంటుందని ల్యాబ్ టెక్నీషియన్లు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే వైద్య సిబ్బంది సైతం పాజిటివ్ పేషెంట్లకు ఫోన్ చేసి ఇంట్లోనే ఉండాలని చెప్పి వదిలేస్తున్నారు. కనీసం సదరు వ్యక్తులకు స్టాంప్ కూడా వేయడం లేదు. దీంతో ఎవరు పాజిటివ్ పేషెంటో .. ఎవరూ కాదో తెలియడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates