కరోనా కంట్రోల్​ కావట్లే .. దేశంలో పెరుగుతున్నకేసులు

న్యూఢిల్లీ:దేశంలో కరోనా కోరలు చాస్తోంది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ కొనసాగుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. గత 4 రోజులుగా ఇంచుమించు రోజుకు 50కి మించి కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 88 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇదే హయ్యెస్టని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 694 మందికి కరోనా సోకినట్టు తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 124, కేరళలో 118 కేసులు నమోదయ్యాయంది. తెలంగాణలో 44, ఏపీలో 11 మంది వ్యాధి సోకిందని వెల్లడించింది. మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా 16 మంది చనిపోయారంది. మహారాష్ట్రలో ముగ్గురు, గుజరాత్‌‌‌‌లో ముగ్గురు, కర్నాటకలో ఇద్దరు, మధ్యప్రదేశ్‌‌‌‌, తమిళనాడు, బీహార్‌‌‌‌,  పంజాబ్‌‌‌‌, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌‌‌‌, హిమాచల్‌‌‌‌లో ఒక్కొక్కరు మృతి చెందారని చెప్పింది. ఇప్పటివరకు అంటని గోవాలో కూడా గురువారం 3 పాజిటివ్‌‌‌‌ కేసులు నమోదయ్యాయంది. దేశవ్యాప్తంగా 45 మంది కోలుకున్నారని చెప్పింది.

ఒక్క రోజే ఐదుగురు మృతి

దేశంలో గురువారం ఒక్కరోజే ఐదుగురు కరోనాతో చనిపోయారు. కర్నాటకలో రెండో కరోనా మరణం నమోదైంది. చిక్కబళ్లాపుర జిల్లాకు చెందిన 75 ఏండ్ల మహిళ కొవిడ్‌‌‌‌ 19తో చనిపోయారని ఆ రాష్ట్ర మెడికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ మంత్రి కే సుధాకర్‌‌‌‌ గురువారం వెల్లడించారు.  ఆ మహిళ ఇటీవల సౌదీ అరేబియాలోని మక్కా నుంచి వచ్చారని అన్నారు. గుజరాత్‌‌‌‌లో మూడో కరోనా మరణం నమోదైంది. 70 ఏండ్ల  కొవిడ్‌‌‌‌ పేషెంట్‌‌‌‌ భావ్‌‌‌‌నగర్‌‌‌‌లో మృతిచెందారు. మహారాష్ట్రలో మరొకరు కరోనాతో చనిపోయారు. మార్చి 24న చనిపోయిన మహిళకు కరోనా పాజిటివ్‌‌‌‌ వచ్చిందని అక్కడి అధికారులు వెల్లడించారు. కాశ్మీర్‌‌‌‌లో తొలి కరోనా మరణం నమోదైంది. హైదర్‌‌‌‌పురకు చెందిన 65 ఏండ్ల వ్యక్తి వైరస్‌‌‌‌ సోకి చనిపోయారు. మధ్యప్రదేశ్‌‌‌‌లో కరోనా అనుమానితుడుగా హాస్పిటల్‌‌‌‌లో చేరిన 47 ఏండ్ల వ్యక్తి గురువారం మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. ఆ పేషెంట్‌‌‌‌కు ట్రావెల్‌‌‌‌ హిస్టరీ లేదని, ఏ అనారోగ్య సమస్యలూ లేవని చెప్పారు.

కుక్కులున్నాయని క్వారంటైన్‌‌‌‌ నుంచి బయటకు

ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని నోయిడాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌‌‌‌ తేలింది. వీళ్లలో ఇద్దరు దంపతులు (30 ఏండ్ల వాళ్లు), ఓ యువతి (21) ఉన్నారు. మార్చి 24 పాజిటివ్‌‌‌‌ వచ్చిన ఇద్దరు దంపతుల కూతురుకే తాజాగా వైరస్‌‌‌‌ సోకిందని డాక్టర్లు చెప్పారు. వార్డులో కుక్కలున్నాయని జమ్మూకాశ్మీర్‌‌‌‌లో కరోనా వైరస్‌‌‌‌ లక్షణాలున్న ఓ మహిళ హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. యూరప్‌‌‌‌ నుంచి గత వారం వచ్చిన ఆ మహిళ ప్రస్తుతం తమ దగ్గరే ఐసోలేషన్‌‌‌‌లో ఉందని మహిళ కుటుంబీకులు వెల్లడించారు.

బెంగాల్‌‌‌‌లో పే అండ్‌‌‌‌ యూజ్‌‌‌‌ క్వారంటైన్‌‌‌‌

ఐసోలేషన్‌‌‌‌లో ఉండే వాళ్ల కోసం పశ్చిమ బెంగాల్‌‌‌‌లో పే అండ్‌‌‌‌ యూజ్‌‌‌‌ హాస్పిటళ్లు స్టార్టయ్యాయి. కొవిడ్‌‌‌‌ 19 పేషెంట్ల కోసం అస్సాం సర్కారు  తాత్కాలిక హాస్పిటళ్లను రెడీ చేయబోతోంది. ఒక్కో ఆస్పత్రిలో 300 బెడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఓ మహిళ నుంచి డాక్టర్‌‌‌‌కు.. ఇంకో ఏడుగురికి ఢిల్లీలోని మహల్లా కమ్యూనిటీ ఆస్పత్రిలోని ఓ డాక్టర్‌‌‌‌కు కరోనా సోకడంతో ఆయనతో కాంటాక్టయిన 900 మందిని క్వారంటైన్‌‌‌‌ చేశారు. డాక్టర్‌‌‌‌తో పాటు ఆయన భార్య, కూతురుకు కూడా వైరస్‌‌‌‌ సోకిందని అధికారులు చెప్పారు. మార్చి 10న సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ మహిళ (38) కరోనా లక్షణాలతో ఆ క్లినిక్‌‌‌‌కు వెళ్లిందని, ఆమె ద్వారానే వ్యాధి సోకిందని గుర్తించారు.  ఆ మహిళతో కాంటాక్టయిన మరో ఐదుగురికి వైరస్‌‌‌‌ సోకింది.

ఢిల్లీలో 24 గంటలు షాప్‌‌‌‌లు ఓపెన్‌‌‌‌

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ ఉన్నా 24 గంటల పాటు నిత్యావసర సరుకులమ్మే షాప్‌‌‌‌లను తెరిచే ఉంచుతామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌ ప్రకటించారు. షాప్‌‌‌‌లకు జనాల తాకిడి పెరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నాగాలాండ్‌‌‌‌లో పెట్రోల్‌‌‌‌ బంకులను రోజు విడిచి రోజు తెరుస్తామని ఆ రాష్ట్రం ప్రకటించింది. నిత్యావసరాల షాపులను రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరవాలంది. కరోనాను కట్టడి చేయడానికి రాత్రీపగలు కష్టపడుతున్న డాక్టర్లు, పోలీసులపై దాడి చేస్తే సహించబోమని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సర్కారు హెచ్చరించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అమెరికాలో ఆర్మీని దించారని, మనకు ఆ పరిస్థితి రావొద్దని చెప్పింది. ఏప్రిల్‌‌‌‌ 14 వరకు ఇంటర్నేషనల్‌‌‌‌ ఫ్లైట్లకు దేశంలోకి అనుమతి లేదని డీజీసీఏ వెల్లడించింది.

లాక్ డౌన్ చేస్తే సరిపోదు..వైరస్ పై అటాక్ చేయాలి

Latest Updates