5 ల‌క్ష‌లు దాటిన క‌రోనా విజేత‌లు: యాక్టివ్ కేసుల క‌న్నా 2 ల‌క్ష‌ల పైనే..

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తోంది. భార‌త్‌లోనూ ఇప్ప‌టికే 8 ల‌క్ష‌ల 20 వేల మందికి పైగా ఈ వైర‌స్ బారిన‌పడ్డారు. అందులో 22,123 మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లితీసుకుంది. అయితే మ‌రోవైపు చికిత్స అనంత‌రం క‌రోనాను జ‌యిస్తున్న వారి సంఖ్య కూడా రోజూ భారీగా పెరుగుతోందిన కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 5 ల‌క్ష‌ల మందికి పైగా ఈ మ‌హ‌మ్మారి బారిన నుంచి కోలుకుని విజేత‌లుగా నిలిచార‌ని, క‌రోనా రిక‌వ‌రీ రేటు 62.78 శాతానికి పెరిగింద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 2,83,407 మంది క‌రోనాతో బాధ‌ప‌డుతూ చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,15,386కు చేరింద‌ని కేంద్రం వెల్ల‌డించింది. ఈ సంఖ్య క‌రోనాతో చికిత్స పొందుతున్న‌ యాక్టివ్ కేసుల క‌న్నా 2,83,407 అధిక‌మ‌ని పేర్కొంది.

మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు అన్ని రాష్ట్రాలు భారీగా టెస్టింగ్ సామ‌ర్థ్యాన్ని పెంచుతున్నాయ‌ని ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా క‌రోనా టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్య 1180కి చేరింద‌ని చెప్పింది. ప్ర‌స్తుతం 841 ప్ర‌భుత్వ‌ ల్యాబ్స్, 339 ప్రైవేటు ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయ‌ని పేర్కొంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,82,511 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన క‌రోనా టెస్టుల సంఖ్య కోటి 13 ల‌క్ష‌లు దాటిన‌ట్లు వెల్ల‌డించింది ఐసీఎంఆర్.

 

Latest Updates