మాస్కు ధరించని వారి ఫోటోలు పంపితే ఫైన్

మాస్కు ధరించని వారి ఫోటోలు పంపితే ఫైన్
  • కరోనా నిబంధనల అమలు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
  • నిబంధనలు ఉల్లంఘించిన ఫోటోలు పంపేందుకు వాట్సప్ నెంబర్: 80109 68295 
  • మాస్క్‌ ధరించకుండా వచ్చే వారిని అనుమతించే సంస్థలకు 10 నుంచి 25వేల వరకు జరిమానా
  • ఆగస్టు 14 వరకు కర్ఫ్యూ ఆంక్షలు పొడిగించిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

అమరావతి: కరోనా కట్టడిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. మాస్కు ధరించకుండా తిరిగే వారిని కట్టడి చేసే విషయంలో వినూత్న చర్యలు చేపట్టింది. ఎవరైనా.. ఎక్కడైనా మాస్కు ధరించకుండా తిరుగుతున్నట్లు కనిపిస్తే అలాంటి వారి ఫోటోలు తీసి ఫిర్యాదు చేయొచ్చు. నిర్ధారించుకుని సదరు వ్యక్తులకు జరిమానా విధించేందుకు ఏర్పాట్లు చేసింది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వాట్సప్ నెంబర్ ను కేటాయించింది. 
మాస్కు ధరించకుండా తిరిగే వారిని దుకాణాల్లోకి.. వ్యాపార సంస్థల్లోకి అనుమతిస్తే.. రూ.10 వేల నుంచి 25 వేల రూపాయల వరకు జరిమానా విధించంతోపాటు.. సదరు దుకాణాన్ని.. లేదా సంస్థను మూడు రోజులపాటు మూయించే చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఖరారు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. మాస్కులు ధరించకుండా తిరుగుతున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం ప్రత్యేకంగా 8010968295 వాట్సప్ నెంబర్‌ను కేటాయించామని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.  కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 14వ తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ప్రతి రోజూ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఫైన్ వేసేందుకు ఇప్పటి వరకు కేవలం వైద్యఆరోగ్యశాఖ అధికారులకే పరిమితమైన అధికారాలను స్థానిక పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ల స్థాయి వారికి కూడా కట్టబెడుతూ ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.