ఒక్క షేక్ హ్యాండ్ తో ఐదుగురికి వ్యాపించిన కరోనా

ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న మిస్టరీపై క్లారిటీ వచ్చింది. ఖిల్లాకు చెందిన ఒకే కుటుంబంలో ఐదు గురికి కరోనా రావడంపై ఉన్న సస్పెన్స్ వీడింది. ట్రావెల్ హిస్టరీ లేకపోవడం, మర్కజ్ లింక్ లేదని తేలడంతో అసలు కరోనా ఎలా సోకిందో స్పష్టం కాలేదు. మొదట కుటుంబ పెద్దకు కరోనా పాజిటివ్ రిపోర్టురాగా, ఒక్కొక్కరి చొప్పున ఐదు గురికి సోకిందని తేలింది. ఈ నెల 13న ఒకే రోజు ఆ ఇంట్లోని ఇద్దరు వ్యక్తులకు కరోనా రావడంతో మొత్తం ఐదుగురికి సోకింది. అయినా ఆ కుటుంబ పెద్దకు ఎలా సోకిందని తేలలేదు.మొదటి సారి పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన  సమయంలో సోకిందనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఆలింక్ ఖమ్మంలోనే ఉందని ఇప్పుడు ఆఫీసర్లు తేల్చారు.

ఇద్దరిది కొత్త పరిచయం..

ఖమ్మంలోని పెద్ద తండాకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీకి వెళ్లి రావడంతో జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గత నెల 12న ఢిల్లీకి వెళ్లిన ఆ వ్యక్తి, తిరిగి అదే నెల 18న అక్కడి నుంచి రైలులో ఖమ్మం వచ్చాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతని కాంటాక్ట్ ల ద్వారా పెద్ద తండాకు చెందిన వ్యక్తిని ఆఫీసర్లు గుర్తించారు. ఈనెల 2న అతడిని క్వారంటైన్ కు తరలించగా, 7న వచ్చిన రిపోర్టుల్లో పాజిటివ్ అనితేలింది. ఆ తర్వాత అతని కాంటాక్టుల ద్వారా మోతీనగర్ కు చెందిన టీస్టాల్ యజమానికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఖిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా రావడానికి కూడా పెద్ద తండాకు చెందిన వ్యక్తే కారణమని అధికారుల విచారణలో తేలింది. గత నెల 18న ఢిల్లీ నుంచి అతను తిరిగి రాగా, అదే నెల 23న కస్బా బజార్ లోని ఓఫ్రూట్ జ్యూస్ సెంటర్ లో వీరిద్దరు కలిసినట్టు ఆఫీసర్లు గుర్తించారు. వీరికి పాత పరిచయం లేకపోయినా, పక్కనున్నమరో వ్యక్తి పరిచయం చేయించారు. ఆ సమయంలో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారని తేలింది. ఆ తర్వాత ఎవరి పనుల్లోవారు నిమగ్నం కాగా, రెండు వారాల తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అధికారులు చేసిన విచారణలో పెద్ద తండాకు చెందిన వ్యక్తి ఈ ప్రస్తావన చెప్పలేదు. రెండో పాజిటివ్ వచ్చిన ఖిల్లాకు చెందిన వ్యక్తి ఆఫీసరతో మాట్లాడే చాన్స్ లేకపోవడంతో ఇన్ని రోజులు ఈ వ్యవహారం చిక్కుముడిలా ఉంది. మొదటి రెండు కేసులకు సంబంధించిన కాంటాక్టులను తేల్చేందుకు కలెక్టర్ ఇటీవల ప్రత్యేక ఆఫీసర్లను నియమించారు. వీరి విచారణలో ఇద్దరూ ఓ ఫ్రూట్ జ్యూస్ సెంటర్లో కలిశారని తెలిసింది. దీంతో కరోనా ఒకరినుంచే అందరికి వచ్చిందనేక్లారిటీ వచ్చింది.

Latest Updates