నిర్మ‌ల్ నుంచి గాంధీకి త‌ర‌లిస్తుండ‌గా.. క‌రోనా అనుమానితుడి మృతి

నిర్మ‌ల్ జిల్లా ఏరియా హాస్పిట‌ల్ నుంచి హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా క‌రోనా అనుమానితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి నిర్మ‌ల్ తిరిగి వ‌చ్చిన‌ ఓ వ్య‌క్తి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్ప‌త్రికి వెళ్లాడు. అక్క‌డ అత‌డిని ఐసోలేష‌న్ వార్డులో ఉంచి చికిత్స అందించారు డాక్ట‌ర్లు. అయితే శుక్ర‌వారం ఆ వ్య‌క్తి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో మెరుగైన చికిత్స కోసం అధికారులు హైద‌రాబాద్ లోని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించారు. అయితే సిటీకి వ‌చ్చేలోపే అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. అతడికి క‌రోనా వైర‌స్ సోకిందా లేదా అన్నదానిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్ప‌ష్ట‌త‌నివ్వాల్సి ఉంది.

 

ఇటీవ‌ల ఢిల్లీ నిజాముద్దీన్ మ‌ర్కజ్ లో జ‌రిగిన త‌బ్ల‌గీ జ‌మాత్ మ‌త ప్రార్థ‌న‌ల‌కు రాష్ట్రం నుంచి సుమారు వెయ్యి మందికి పైగా హాజ‌రై తిరిగి స్వ‌స్థ‌లాల‌కు వ‌చ్చిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. అయితే ఆ ప్రార్థ‌న‌ల‌కు విదేశీయులు రావ‌డంతో వారితో స‌న్నిహితంగా మెలిగిన చాలా మందికి వైర‌స్ సోకింది. ఈ నేస‌థ్యంలోనే గ‌డిచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. శుక్ర‌వారం ఒక్క రోజే 75 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మూడ్రోజుల క్రితం 50కి స‌మీపంలో ఉన్న కేసులు అంత‌లోనే శుక్ర‌వారం రాత్రికి 229కి చేరింది. ఇందులో మొత్తం 32 మంది డిశ్చార్జ్ కాగా.. 11 మంది మ‌ర‌ణించారు.

Latest Updates