కరోనా బాధితుడు ఆస్పత్రి నుంచి పరార్

  •                 యూఎస్ నుంచి బెంగళూరు వచ్చిన అనంతపురం వాసి
  •                 జలుబు, జ్వరం ఉండటంతో క్వారంటైన్​కి తరలింపు
  •                 రెండో రోజు హాస్పిటల్ నుంచి పరార్

యూఎస్ నుంచి బెంగళూరు వచ్చిన వ్యక్తి తనకు కరోనా సోకిందన్న భయంతో ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన వివరాలు మీడియా బుధవారం వెల్లడించింది. మూడ్రోజుల కిందట యూఎస్ నుంచి బెంగళూరు ఎయిర్ పోర్టుకి వచ్చిన ప్రయాణికులను అక్కడి అధికారులు స్ర్కీనింగ్ టెస్ట్ చేసి 14 రోజుల క్వారంటైన్ కోసం రాజీవ్ గాంధీ చెస్ట్ ఆసుపత్రికి తరలించారు. టెస్టుల్లో కొందరు విదేశీ ప్రయాణికులకు కరోనా లేనట్లు నిర్ధారణ అయినా ప్రాథమిక పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బాధితుడిని ఆసుపత్రిలోనే క్వారంటైన్​లో ఉంచారు. ఈ క్రమంలో బాధితుడు ఆస్పత్రి నుంచి బుధవారం పరారయ్యాడు. తనకు కరోనా వచ్చిందన్న భయంతోనే అతడు పారిపోయి ఉంటాడని అక్కడి అధికారులు చెప్తున్నారు. అతని నుంచి సేకరించిన శాంపిల్ రిజల్ట్స్ వస్తే గాని, కరోనా సోకిందా లేదా అనేది తేలుతుందని చెబుతున్నారు. ఎయిర్ పోర్ట్ అధికారులు ఇచ్చిన అడ్రస్ ఆధారంగా బాధితుడి కోసం కర్నాటక పోలీసులు గాలిస్తున్నారు. బుధవారం నాటికి కర్నాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14 కు చేరినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

Latest Updates