భయంగానే బయటికి.. అంతటా కరోనా టెన్షన్

పలుచోట్ల ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌‌‌‌ సెంటర్లు ఓపెన్​
సర్కారు ఆదేశాలను పట్టించుకోని మేనేజ్​మెంట్లు
యూనివర్సిటీలు, గవర్నమెంట్​ కాలేజీలు మూసివేత

హైదరాబాద్, వెలుగు: కరోనా ప్రభావం, ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్తల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైన టెన్షన్​ కనిపిస్తోంది. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లేందుకు జనం భయపడుతున్నారు. ఇండ్లలోంచి భయం భయంగానే బయటికి వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా చాలాచోట్ల ప్రైవేటు విద్యా సంస్థలు యథావిధిగా క్లాసులు నిర్వహించాయి. యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీలు మాత్రం మూసివేశారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు నడుస్తుండడంపై కొందరు ట్విట్టర్​ ద్వారా మంత్రి కేటీఆర్​కు కంప్లయింట్​ చేశారు. దాంతో ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేలా చూడాలని కేటీఆర్​ ఎడ్యుకేషన్​ మినిస్టర్​ సబితారెడ్డిని కోరగా.. ఆమె వెంటనే విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్ స్పెషల్​ సీఎస్​ చిత్రారామచంద్రన్​ రివ్యూ చేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరించే విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఇక చాలా స్కూళ్లు, కాలేజీలు స్టూడెంట్లకు సెలవులు ఇచ్చినా టీచింగ్, నాన్​ టీచింగ్​ స్టాఫ్  రెగ్యులర్​గా డ్యూటీకి రావాలని ఆదేశించిన విషయం కూడా విద్యా శాఖ దృష్టికి చేరింది. దీంతో అందరికీ సెలవులు ఇవ్వాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఒక్క సెంట్రల్​ యూనివర్సిటీ మినహా మిగతా యూనివర్సిటీల్లో హాస్టళ్లు, మెస్​లను కూడా మూసేశారు. సెంట్రల్​వర్సిటీలో వివిధ రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్​ ఉంటారని, వారు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందిపడతారని వర్సిటీ పేర్కొంది.

పార్కులన్నీ మూత

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హైదరాబాద్​ సహా రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని పార్కులు, స్టేడియంలను మూసివేశారు. మార్నింగ్​ వాక్​ చేసే పార్కులలోకి కూడా జనాలను అనుమతించలేదు. కాలనీల్లోని పార్కుల్లోనూ జనం తగ్గిపోయారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 వరకు పబ్బులు, బార్లు, క్లబ్బులు, పర్మిట్​రూములను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల వైన్​షాపుల వద్ద రద్దీ పెరిగింది. సాధారణంగా సాయంత్రం పూట వైన్స్ వద్ద రద్దీ ఉంటుంది. రెండు రోజులుగా పొద్దంతా జనం పెరిగిపోయారు.

కన్జూమర్​ కేసులు రెండు రోజులే..

కన్జూమర్​ ఫోరం వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్​లో కేసుల విచారణపైనా కరోనా ఎఫెక్ట్​ పడింది. ప్రస్తుతం వారంలో ఐదు రోజులు విచారణ జరుగుతుండగా.. ఇకపై అర్జెంట్​ కేసులను మాత్రమే విచారించాలని కమిషన్​ చైర్మన్ ఆదేశించారు. సోమవారం, గురువారం రోజుల్లో మాత్రమే, అదీ అత్యవసర కేసులనే విచారిస్తామని కమిషన్​ ప్రకటించింది.

ఐఏఎస్ అర్వింద్​కుమార్​కు టెస్టులు

మున్సిపల్​ శాఖ ప్రిన్సిపల్​ సెక్రెటరీ అర్వింద్​కుమార్​ కరోనా టెస్టులు చేయించుకున్నారు. ‘‘నాకు ఎలాంటి దగ్గు, జలుబు లేదు. విదేశాలకు వెళ్లి రావడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళ్లి కరోనా, ఇతర 19 పరీక్షలు చేయించుకున్నాను. ఇంటి వద్ద ఐసోలేషన్​లో ఉన్నాను..’’ అని అర్వింద్​ ప్రకటించారు.

గుళ్లకు వెళ్లట్లేదు

కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్​ దేవాలయాలపైనా పడింది. రాష్ట్రంలోని ప్రముఖ హిందూ ఆలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరంలలో సాధారణ రోజులతో పోల్చితే సోమవారం జనం బాగా ఎక్కువగా ఉంటారు. అలాంటిది ఈ సోమవారం ఆయా ప్రాంతాలన్నీ వెలవెలబోయాయి.

Latest Updates