వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్.. లేటవుతున్న కరోనా టెస్టుల రిజల్ట్

హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టులు చేయించుకున్నవాళ్లు తమకు వైరస్ ఉందో, లేదో తెలుసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. టెస్ట్ శాంపిల్ తీసుకునేటప్పుడు సెల్ నంబర్ నుంచి ఇంటి నంబర్ వరకూ అన్నీ తీసుకుంటున్న ఆఫీసర్లు.. టెస్ట్ ఫలితం మాత్రం బాధితులకు చెప్పడం లేదు. కనీసం వైరస్ పాజిటివ్ వచ్చినవాళ్లకు కూడా విషయం వెంటనే చేరవేయడం లేదు. ల్యాబ్​ల వద్ద నుంచి ఆరోగ్యశాఖ, పోలీస్‌‌ శాఖ ఆఫీసర్లకు.. అక్కడి నుంచి స్థానిక పోలీసులకు సమాచారం వెళ్లి.. ఆ స్థానిక పోలీసులు ఫోన్లు చేసే వరకూ పాజిటివ్ వచ్చిందన్న విషయం బాధితులకు తెలియడం లేదు. శాంపిల్‌‌ ఇచ్చిన మరుసటి రోజు కూడా ఫోన్ రాకపోయేసరికి చాలా మంది వైరస్ నెగెటివ్​ వచ్చిందని భావిస్తున్నారు. ఇదే భావనతో ఎప్పటిలాగే తమ పనులకు వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత పాజిటివ్ అని పోలీసుల నుంచి సమాచారం వస్తున్నప్పటికీ.. బాధితులు అప్పటికే చాలా మందిని కలుస్తున్నారు. దీంతో వైరస్ మరింత మందికి స్ర్పెడ్ అయ్యే ప్రమాదం ఏర్పడుతోంది.

నెగెటివ్​​ వచ్చిందేమోననుకొని..!

హైదరాబాద్​ బంజారాహిల్స్‌‌లోని ప్రైవేటు ఆఫీసులో పనిచేసే ఓ వ్యక్తి ఈ నెల 17న టెస్ట్ కోసం శాంపిల్​ ఇచ్చాడు. 19వ తేదీ వరకూ టెస్ట్ రిజల్ట్ రాలేదు. టెస్ట్ రిపోర్ట్ తెలుసుకునేందుకు ప్రయత్నించినా, ఎవరూ సరిగా స్పందించలేదు. పోలీసుల నుంచి ఫోనూ రాలేదు. దీంతో నెగెటివ్​ వచ్చిందేమో అనుకుని మరుసటి నాడు ఆ వ్యక్తి ఆఫీసుకు వెళ్లాడు. అదే రోజు సాయంత్రం అతడికి పాజిటివ్ వచ్చిందని పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో బాధితుడి ఆఫీసులో వాళ్లంతా క్వారంటైన్‌‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేరోజు శాంపిల్ ఇచ్చిన ఇద్దరు మీడియా వ్యక్తుల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ నెల 17న సెక్రటేరియట్‌‌లో శాంపిల్స్‌‌ ఇవ్వగా, మరుసటి రోజు రాత్రి వరకూ వాళ్లకు ఫోన్లు రాలేదు. దీంతో 19వ తేదీ నుంచి డ్యూటీకి హాజరయ్యారు. 20వ తేదీన పాజిటివ్ వచ్చినట్టు బాధితులకు ఫోన్లు వచ్చాయి. అప్పటికే వాళ్లు ఆఫీసులో, ఇంట్లో అందరితో కాంటాక్ట్ అయ్యారు. చాలా మందికి ఇలాగే జరుగుతుండడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరి విషయంలో టెస్ట్ శాంపిల్స్ మిస్ అవుతున్నాయి. ఒకసారి శాంపిల్ ఇచ్చి రిజల్ట్ కోసం సంప్రదిస్తే.. శాంపిల్‌‌ మిస్ అయిందని, మరోసారి వచ్చి శాంపిల్ ఇవ్వాలని స్థానిక ఆఫీసర్లు చెబుతున్నారు. అధికారులు, శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది.

చొరవ చూపని హెల్త్ ఆఫీసర్లు

కరోనా టెస్టులు చేయించుకునే వారి వద్ద ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, ప్రస్తుత ఇంటి అడ్రస్‌‌ను ఆఫీసర్లు తీసుకుంటున్నారు. ఐసీఎంఆర్ రూల్స్‌‌ ప్రకారం టెస్టుకు ముందే అన్నింటినీ ఆన్‌‌లైన్‌‌లో ఎంటర్ చేయాలి. టెస్ట్ చేసిన వెంటనే ల్యాబ్ సిబ్బంది.. పాజిటివా, నెగెటివా వైద్యారోగ్య శాఖ పోర్టల్‌‌లో అప్‌‌డేట్ చేస్తున్నారు. ఇదే టైమ్‌‌లో రిపోర్టును బాధితులకు ఎస్‌‌ఎంఎస్‌‌ పంపించొచ్చు. కానీ, ఇందుకు ఆఫీసర్లు చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి. మొదట్లో నెగెటివ్​ వచ్చినవారికీ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు అదీ చేయకపోవడంతో రకరకాల సమస్యలు వస్తున్నాయి.

Latest Updates