హైదరాబాద్‌కు ఇయ్యాల్నే వ్యాక్సిన్

  • ఒకే విడతలో ఆరున్నర లక్షల డోసులొస్తున్నయ్ 
  • 2,98,424 మందికి కొవిషీల్డ్ టీకాలు
  • 1,213 వ్యాక్సినేషన్ సెంటర్లలో ఏర్పాట్లు
  • 9,720 మంది వ్యాక్సినేటర్లు సిద్ధం 

 

హైదరాబాద్, వెలుగు:  కరోనా వ్యాక్సిన్‌ డోసులు మంగళవారం పుణె నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నాయి. ఒకే విడతలో 6.5 లక్షల కొవిషీల్డ్‌ డోసులు వస్తున్నట్టు స్టేట్ హెల్త్ ఆఫీసర్లు వెల్లడించారు. వీటిని స్టోర్ చేసేందుకు కోఠిలోని సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్ సెంటర్‌‌లో ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి జిల్లాల్లోని సెంటర్లకు, అక్కడి నుంచి కోల్డ్ చైన్ పాయింట్లకు పంపించనున్నారు. రాష్ర్టవ్యాప్తంగా 866 కోల్డ్ చెయిన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ కు 1,213 సెంటర్లను సిద్ధం చేశారు. వ్యాక్సిన్ కోసం ఇప్పటివరకూ 2 లక్షల 98 వేల 424 మంది హెల్త్ వర్కర్లు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. ఇందులో 1 లక్ష 42 వేల706 మంది ప్రభుత్వ, 1 లక్ష 46 వేల 722 మంది ప్రైవేట్ హెల్త్ స్టాఫ్ ఉన్నారు. అత్యధికంగా గ్రేటర్‌‌ హైదరాబాద్‌లో 208 సెంటర్లలో 78,226 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్‌ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే చాన్స్‌ ఉంది. రాష్ర్టవ్యాప్తంగా వ్యాక్సిన్ వేయడానికి 9,720 మంది హెల్త్ స్టాఫ్‌కు ట్రైనింగ్ ఇచ్చారు.

మరో 224 మందికి కరోనా

రాష్ర్టంలో మరో 224 మందికి కరోనా సోకింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకూ 24,785 మందికి టెస్టు చేస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో 56 మందికి, జిల్లాల్లో168 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. వీరితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 90 వేల 8కి చేరింది. ఇందులో 2 లక్షల 83 వేల 924 మంది కోలుకోగా, 4,518 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 2,439 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. మరో 2,079 మంది దవాఖాన్లలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం కరోనాతో ఒకరు చనిపోయారని, మృతుల సంఖ్య1,566కు పెరిగిందని బులెటిన్‌లో పేర్కొన్నారు.

 

Latest Updates