కరోనా యమ డేంజరస్​

మొన్న… సార్స్‌ వైరస్.

నిన్న…  జైకా వైరస్.

నేడు… 2019 నోవెల్ కరోనా వైరస్.

చైనాలో తొలిసారి గుర్తించిన కరోనా వైరస్ క్రమంగా అన్ని దేశాలకూ విస్తరిస్తోంది. ఇది సార్స్ వైరస్​ లాంటిదే. చాలా వేగంగా వ్యాపిస్తోంది.  ఎంతగానంటే… రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా వ్యాపిస్తుంది. చేతులు శుభ్రం చేసుకునేలోపే వచ్చేస్తాయి.  కరోనాని కనుగొన్న వుహాన్​ (చైనా) సిటీలో ప్రీఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో 1,000 పడకల సామర్థ్యం గల ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఆరు రోజుల్లోనే… ఆస్పత్రి పూర్తి చేయాలన్నది టార్గెట్.

గతంలో 2002 నవంబరు నుంచి 2003 జూలై మధ్యకాలంలో దక్షిణ చైనాలో కరోనా కుటుంబానికి చెందిన సార్స్‌‌ వైరస్‌‌ విజృంభించి ఇతర దేశాలకూ వ్యాపించింది. 37 దేశాల్లో దాదాపు 8,000 మంది సార్స్‌‌ వైరస్‌‌ బారిన పడగా, 774 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందనే విషయంపై స్పష్టత కొరవడటంతో చైనా వణికిపోతోంది.  ఇప్పటికే ఈ వైరస్​వల్ల చైనాలో 81 మంది ప్రాణాలు కోల్పోగా, 2744 మందిలో ఈ లక్షణాలు బయటపడ్డాయి.

వైరస్ శరీరం పైకి వచ్చి, క్రమంగా నోటి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. శ్వాస నాళాల ద్వారా లోనికి ప్రవేశించి, అక్కడ వైరస్‌‌గా డెవలప్​ అయి, వ్యాధిగా మారే అవకాశం ఉందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ డిప్యూటీ మినిస్టర్ లిన్ బిన్ పేర్కొన్నారు. వుహాన్ నగర జనాభా 1.1 కోట్లు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. మెడికల్ షాపుల్లో మందులు అయిపోతున్నాయి.  చైనాలో ఉన్న ఇండియన్​ టీచర్ ప్రీతి మహేశ్వరికి కూడా ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కరోనా వైరస్  చైనాలోని బీజింగ్‌‌, షాంఘై, దక్షిణ గాంగ్‌‌డాంగ్‌‌ ప్రావిన్స్‌‌లోనూ వందలాది జనాలకు సోకింది. ఆసియా దేశాలతో పాటు అమెరికాకి పాకడంతో అక్కడ తొలి కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే థాయ్​లాండ్, జపాన్, దక్షిణ కొరియాలకు వ్యాపించింది.

సీఫుడ్​ సెంటర్​లో వైరస్​ పుట్టింది!

వుహాన్‌‌లోని ఒక సీ ఫుడ్​ మార్కెట్‌‌ సెంటర్​ నుంచి కొత్త వైరస్‌‌ వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. ఈ వైరస్​ కారణంగా ఇద్దరు చనిపోవడంతో కంగారు పడ్డారు. వెంటనే వీరి శాంపిల్స్‌‌ను  లండన్‌‌కు పంపించారు. అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధించి దీనిని ‘కరోనా వైరస్‌‌’గా గుర్తించారు. లాటిన్‌‌ పదం కరోనా (కిరీటం) నుంచి ఈ పేరు వచ్చింది. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌‌ మైక్రోస్కోప్‌‌లో చూసినప్పుడు రాజులు ధరించే కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఆ పేరు పెట్టారు.

మన దేశంలో…..

తాజాగా ఈ వైరస్ లక్షణాలు రాజస్థాన్​లోని జైపూర్, కేరళలో, హైదరాబాద్‌‌లోనూ కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇప్పటి వరకూ కరోనా వైరస్ లక్షణాలను నిర్ధారించలేదు. చైనా, హాంకాంగ్‌‌‌‌ల నుంచి వచ్చినవాళ్లలో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. వైరస్ లక్షణాలు బయటపడకపోయినా ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదిస్తున్నారు. అలాగే, కేరళలో ఏడుగురికి, హైదరాబాద్‌‌లో నలుగురికి, బీహార్​, రాజస్థాన్​లలోనూ  కరోనా సోకి ఉండొచ్చన్న అనుమానంతో టెస్టులు చేస్తున్నారు.  చైనా నుంచి వస్తున్న స్టూడెంట్లకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు మన దేశంలో ఈ వ్యాధి ఎవరికీ సోకలేదని చెబుతున్నప్పటికీ, ఇది వైరస్ అయినందున గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదముంది. కాబట్టి, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుతానికి ఈ వైరస్‌‌కి మందు (వ్యాక్సిన్) లేదు. ఇది రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌‌గా సబ్బు, మంచినీళ్లతో చేతులు కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దు. అలాగని, వారిని అంటరానివారిలా చూడకూడదు.

ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటివి వస్తే… వాళ్లు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉంటే మంచిది. ఎక్కువగా నీళ్లు తాగాలి. ఒకట్రెండు రోజుల్లో తగ్గకపోతే… ఎవరినీ టచ్ చెయ్యకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

 

ఆరు రోజుల్లోనే హాస్పిటల్

కరోనాని కనుగొన్న వుహాన్​ (చైనా) సిటీలో ప్రీఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో 1,000 పడకల సామర్థ్యం గల ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. మొత్తం 2,69,000 చదరపు అడుగుల స్థలంలో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. 2003లో కూడా సార్స్ వైరస్ సోకిన వారికి వైద్యం అందించేందుకు బీజింగ్‌లో ఇలాగే ఒక ఆస్పత్రిని ఏడు రోజుల్లో నిర్మించారు. అదే తరహాలో మరో ప్రీఫ్యాబ్రికేటెడ్  ఆస్పత్రి ఆరు రోజుల్లోనే తయారవుతోంది.

శ్వాస వ్యవస్థపై ప్రభావం

శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960ల్లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఈ వైరస్‌లు ఆరు రకాలు

సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌–సార్స్‌- సీఓవీ

మిడిల్ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌–మెర్స్‌ -సీఓవీ

హ్యూమన్‌ కరోనా వైరస్‌–హెచ్‌కేయూ 1

హ్యూమన్‌ కరోనా వైరస్‌–ఓసీ 43

హ్యూమన్‌ కరోనా వైరస్‌–ఎన్ఎల్‌ 63

హ్యూమన్‌ కరోనా వైరస్‌–229 ఈ

వ్యాప్తి

చలికాలంలో ఎక్కువగా వ్యాపించే స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, కరోనా వ్యాధి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి.

మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది.

ఇది సోకినవారు తుమ్మినా, దగ్గినా వ్యాపించే ప్రమాదం.

రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా  ప్రమాదమే.

రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా వ్యాపిస్తుంది. వైరస్ శరీరం పైకి వచ్చి, క్రమంగా అవి నోటి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ఇవి ఎంత వేగంగా చొరబడతాయంటే… చేతులు శుభ్రం చేసుకునేలోపే వచ్చేస్తాయి.

లక్షణాలు

– దగ్గు,- జలుబు.- ముక్కు కారడం,- జ్వరం, తలనొప్పి, గొంతు మంట,- ఒంటి నొప్పులు, ఛాతీలో నొప్పి, న్యుమోనియా, ఊపిరి తీయడంలో ఇబ్బంది, గాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్య, కిడ్నీ పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. చివరికి మరణానికి దారి తీస్తుంది. ఈ వైరస్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఎలాంటి యాంటీ రిట్రో వైరస్‌ మందులు, టీకాలు అందుబాటులో లేవు. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు

కరోనా వైరస్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉండడంతో మెడికల్​ హెల్త్​ ఆఫీసర్లు అప్రమత్తం అవుతున్నారు. హైదరాబాద్​లోని ఫీవర్‌ ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేటెడ్‌ వార్డును ఏర్పాటు చేశారు. బ్లడ్​ శాంపిల్స్​ సేకరించి పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లేబొరేటరీకి పంపిస్తున్నారు. గతవారం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ డాక్టర్ జలుబు, దగ్గు లక్షణాలతో ఫీవర్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అతడి బ్లడ్​ని సేకరించి పుణె వైరాలజీ ల్యాబ్​కి పంపగా, కరోనా వైరస్‌ లేదని తేలింది. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్‌కి, మేడారం జాతరకి పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తున్నందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది.

Latest Updates