కరోనా మనకు పాఠాలు నేర్పింది

న్యూఢిల్లీ:  కనీస అవసరాల కోసం ఇతరులమీద ఆధారపడొద్దని కరోనా మనకు గుణపాఠం నేర్పిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ప్రతి గ్రామ సభ, బ్లాక్, జిల్లా.. కనీస అవసరాల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పారు. లాక్​డౌన్​కు ప్రజలు బాగా మద్దతిస్తున్నారని మోడీ మెచ్చుకున్నరు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా సోషల్​ డిస్టెన్స్ ఇంపార్టెన్స్ ను గుర్తించారని, ఆ పదాన్ని సింపుల్​గా ‘రెండు గజాల దూరం’ అంటూ ట్రాన్స్​లేట్​ చేసుకుని పాటిస్తున్నారని చెప్పారు. ఈమేరకు శుక్రవారం ‘పంచాయతీ రాజ్​ దివస్’ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పంచాయతీ మెంబర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు. గతంలో ఎన్నడూ ఎదుర్కోని సరికొత్త సవాళ్లను కరోనా విసిరిందని, అదే టైంలో మనకు కొత్త విషయాలను నేర్పిందని ప్రధాని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా ‘స్వయం సమృద్ధి’ అవసరాన్ని వైరస్  గుర్తుచేసిందన్నారు. వైరస్​ బారిన పడి దేశాలన్నీ సతమతమవుతుంటే మనమంతా కలిసికట్టుగా దానిని ఎదుర్కొంటున్నామని చెప్పారు. ప్రజలందరి సహకారంతోనే కరోనాను వేగంగా వ్యాపించకుండా అడ్డుకున్నామని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో వనరులు లేకున్నా, వైరస్​ను అడ్డుకోవడంలో మాత్రం మనం ముందున్నామని వివరించారు. దీనికి కారణం ప్రజలేనని, లాక్​ డౌన్​ రూల్స్​కు కట్టుబడి ఉండడం వల్లే మన దేశంలో పరిస్థితి అదుపులో ఉందన్నారు.

జనం తిట్టుకుంటున్నరా?

పండుగల వేళ ఇంట్లోంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా చేసినందుకు ప్రజలు తనను తిట్టుకుంటున్నారా అంటూ పంచాయతీ మెంబర్లను ప్రధాని అడిగారు. జనం కోపంగా ఉన్నారా అని ప్రధాని అడగగా.. ప్రాణాలు కాపాడేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారని పంచాయతీ మెంబర్లు చెప్పారు. వైరస్​ను ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో తాము తీసుకుంటున్న చర్యలను వారు ప్రధానికి వివరించారు.  మోడీ వీడియో కాన్ఫరెన్స్‌‌ లో మన రాష్ట్రం తరపున పంచాయతీరాజ్‌‌ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌‌రావు పాల్గొన్నారు.

వైరస్​ను ఇంట్లోకి తీస్కెళ్లేది మనమే..

కరోనా కొత్త రకం వైరస్​ అని, తనంతట తాను అది ఇండ్లల్లోకి రాదని ప్రధాని చెప్పారు. వీధిలో ఉన్న వైరస్​ను ఇంట్లోకి తీసుకెళ్లేది మనమేనని, ఒకసారి లోపలికి వచ్చాక అది ఎవరినీ వదలదని మోడీ వివరించారు. వైరస్​ విషయంలో జనాలకు కరెక్ట్​ సమాచారం చేరేలా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని చెప్పారు. ప్రతీ కుటుంబానికి నిజమేంటో తెలియాలని అన్నారు. మనమందరం కలిసి ఫైట్​ చేసి వైరస్​ను ఓడిద్దామన్నారు. ఈ సందర్భంగా ‘ఈ– గ్రామస్వరాజ్’ పోర్టల్​ను, మొబైల్​ యాప్​ను ప్రధాని మోడీ ప్రారంభించారు.

Latest Updates