‘కరోనా’కు చిన్న, పెద్దా తేడా లేదు!

‘కరోనా’కు చిన్న, పెద్దా తేడా లేదు!
కొన్ని దేశాల్లో యువతపైనా తీవ్ర ప్రభావం 
వృద్ధులు, పేషెంట్లపై ఎఫెక్ట్ ఎక్కువే

‘‘కరోనా వైరస్ సోకితే.. యువతీ, యువకులు, మధ్య వయసులో ఉన్నోళ్లకు పెద్దగా డేంజరేమీ కాదు. వృద్ధులు, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలున్నోళ్లకే ఎక్కువ డేంజర్ ఉంటది. చనిపోయే ప్రమాదం కూడా వాళ్లకే ఎక్కువగా ఉంటది..” అని అందరూ అనుకుంటున్నరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డేటా ప్రకారం, కరోనా వైరస్ సోకుతున్నోళ్లలో 3.4 శాతం మంది చనిపోతున్నారని, 80 ఏళ్లకు పైబడినోళ్లలో 21.9 శాతం మంది చనిపోతున్నారని తెలుస్తోంది. కానీ.. కొన్ని దేశాల్లో కొవిడ్–19 పేషెంట్ల లెక్కలను చూస్తే మాత్రం.. దానికి యంగ్, ఏజ్డ్ అన్న తేడాలేమీ లేవని.. ఎవరినైనా అది చావు అంచులకు తీసుకుపోగలదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికాలో కరోనా పేషెంట్ల డేటాను చూస్తే యంగ్ గా ఉన్నోళ్లూ వ్యాధికి తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని అంటున్నారు. చైనాలో కొవిడ్–19 సోకినోళ్లలో వృద్ధులు, ఇతర రోగాలున్నోళ్లకే ఎక్కువగా సీరియస్ అయింది. కానీ ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో 20 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్నోళ్లు కూడా భారీగానే ఐసీయూల పాలయ్యారు. ఇటలీలో 28 వేల కరోనా పేషెంట్లు నమోదు కాగా, వారిలో పాతిక శాతం మంది 19 నుంచి 50 ఏండ్ల మధ్యలోని వాళ్లే ఉన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించిన డేటా ప్రకారం, అమెరికాలో కూడా ఇలాంటి ట్రెండే కొనసాగుతోంది. ఆ దేశంలో తొలి 2,500 కేసుల్లో 705 మంది 20 నుంచి 44 ఏళ్ల మధ్యవారే ఉన్నారు. వీరిలో 15% నుంచి 20% మంది హాస్పిటళ్లలో చేరారు. 4% మందిని ఐసీయూల్లో పెట్టారు. కొంత మంది చనిపోయారు. ఇక అమెరికాలో 85 ఏళ్లపైబడినోళ్లు 144 మందికి కరోనా సోకగా, వారిలో 70% మంది హాస్పిటళ్లలో చేరారు. 29% మందిని ఐసీయూల్లో పెట్టారు. ప్రతి నలుగురిలో ఒకరు చనిపోయారు. ఈ లెక్కలను బట్టి చూస్తే.. కరోనా వల్ల యూత్ కు కూడా డేంజర్ ఎక్కువేనని, అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

103 ఏళ్ల బామ్మ.. కరోనాను జయించింది 

ఇరాన్ లో ఇటీవలే 91 ఏళ్ల ఓ తాత కొవిడ్–19 సోకినా.. పూర్తిగా కోలుకుని ఇంటికెళ్లాడు. తాజాగా 103 ఏళ్ల ఓ బామ్మ కూడా కరోనాను జయించింది. ఇరాన్ లోని సెమ్నాన్ సిటీకి చెందిన ఆ బామ్మ సెమ్నాన్ యూనివర్సిటీ ఆఫ్​మెడికల్ సైన్సెస్ లో ట్రీట్ మెంట్ తీసుకుని, పూర్తిగా కోలుకుని మంగళవారం డిశ్చార్జ్ అయిందని స్థానిక మీడియా వెల్లడించింది. కెర్మాన్ లో కూడా ఓ 91 ఏళ్ల తాత పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడని తెలిపింది. ఆ తాతకు ఆస్తమా ఉన్నా కూడా కొవిడ్–19 బారి నుంచి బయటపడటం విశేషంగా చెప్పుకొంటున్నారు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Latest Updates