వస్తువులపై కరోనా వైరస్ లైఫ్ 9 రోజులు!

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశాన్ని వణికిస్తోంది. రోజురోజుకీ ఈ వైరస్ సోకిన (కోవిడ్-19) బాధితులు భారీగా పెరుగుతున్నారు. శుక్రవారం నాటికి 65 మంది దీని బారినపడినట్లు చైనా వెల్లడించింది. వారిలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అలాగే గురవారం నాడు జపాన్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. చైనా బయట ఈ వైరస్ కారణంగా మరణించిన తొలి ఘటన ఇదే. కరోనా వైరస్‌ను ఇప్పటికే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీని నియంత్రణపై పర్యవేక్షణకు 15 మంది నిపుణుల టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఆ బృందం శనివారం చైనాలో పర్యటించబోతోంది. ఆ దేశం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, ఇంకా ఏవైనా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరంపై డబ్ల్యూహెచ్‌వోకు నివేదించబోతోంది.

మంచాలు.. తలుపులపైనా సజీవంగా వైరస్

కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే తాజాగా జర్మనీకి చెందిన పరిశోధకుల రీసెర్చ్‌లో మరో విషయం తేలింది. కరోనా వైరస్ సోకిన పేషెంట్లు తాకిన వస్తువులపైనా 9 రోజుల వరకు బతికే ఉంటుందని గుర్తించారు. సార్స్, మెర్స్‌తో పాటు కరోనా వైరస్‌ను ఉమ్మడిగా పరిశీలించారు RUB వర్సిటీ మాలిక్యులర్ అండ్ మెడికల్ వైరాలజీ విభాగం ప్రొఫెసర్లు. వారి అధ్యయనం వివరాలను జర్నల్ ఆఫ్ హాస్పిటల్ ఇన్‌ఫెక్షన్‌లో ప్రచురించారు. కరోనా సోకిన బాధితులు తాకిన మెటల్, ప్లాస్టిక్ వస్తువులపై వైరస్ కనీసం నాలుగైదు రోజులు సజీవంగా ఉండగలదని తెలిపారు శాస్త్రవేత్తలు. వాతావరణం చల్లగా ఉంటే దాని జీవితకాలం ఇంకా పెరిగి 9 రోజుల వరకూ అలాగే ఉంటుందన్నారు. కరోనా బాధితులను ఉంచిన హాస్పిటల్స్‌లోని తలుపులు, టేబుల్స్, మంచం స్ట్రిప్స్‌ లాంటి వాటిపైనా వైరస్ ఉంటుందని చెప్పారు. ఆ వస్తువులను ఇథనాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైడ్రోక్లోరైట్ వంటివాటితో క్లీన్ చేస్తే ఒక్క నిమిషంలోపే వైరస్ చనిపోతుందని వివరించారు.

Latest Updates