దేశంలో కరోనాతో మరో వ్యక్తి మృతి

భారత్‌లో మరో కరోనా మరణం నమోదైంది. మహారాష్ట్రలో 64 ఏళ్ల వృద్ధుడు వైరస్ బారినపడి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే కరోనా వల్ల కర్ణాటకలో 76 ఏళ్ల వృద్ధుడు, ఢిల్లీలో 69 ఏళ్ల మహిళ మరణించారు. ఇవాళ మహారాష్ట్రలోని ముంబైలో ఓ పేషెంట్ మృతితో దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది.

ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన 64 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలు కనిపించడంతో ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్‌లో చేరాడు. అక్కడ పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తుండగా.. అతడు మరణించినట్లు మంగళవారం ఉదయం ప్రకటించారు వైద్య శాఖ అధికారులు.

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 126కు చేరింది. అందులో మహారాష్ట్రలోనే అత్యధికంగా 39 మంది వైరస్ బారినపడ్డారు. అందులో 36 మంది ఇండియన్స్ కాగా, 3 విదేశీయులు ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రంలో ఇవాళ తొలి మరణం నమోదైంది. కేరళలో 24 మంది కరోనా బారినపడగా ఇప్పటికే ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఢిల్లీలో ఏడుగురికి కరోనా రాగా.. ఒకరు మరణించారు. ఇద్దరు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కర్ణాటకలో ఎనిమిది మంది వైరస్ బారినపడ్డారు. అందులో ఒక పేషెంట్ మరణించాడు. తెలంగాణలో నలుగురికి వైరస్ సోకగా.. ఒక పేషెంట్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు.

Latest Updates