కరోనాతో అమెరికా ఆగం

  • వారం రోజులుగా రోజూ సగటున 34 వేలకుపైనే
  • ఈ వారంలోనే 2.39 లక్షలు
  • కరోనా బారిన 25 లక్షల మంది.. 1.26 లక్షల మంది మృతి

అమెరికాను కరోనా వణికిస్తోంది. రోజూ వేలాది మంది దానికి బాధితులవుతున్నారు. కొన్ని రోజుల పాటు కేసుల ఉధృతి తగ్గినా వారం రోజుల నుంచి మళ్లీ తీవ్రత పెరిగింది. గురువారం ఒక్కరోజే 40,184 కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అక్కడ ఇప్పటి దాకా ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే ఫస్ట్ . ఒక్కరోజు కేసుల్లో తొలిసారి 40 వేల మార్కును అందుకుంది అమెరికా. మొత్తంగా ఈ రెండు మూడు రోజులుగా కేసులు మరింత ఎక్కువయ్యాయి. ఈ వారం రోజుల్లో రోజూ సగటున 34 ,158 కేసులు నమోదయ్యాయి. వారంలో మొత్తం 2 లక్షల 39 వేల 109 కేసులొచ్చాయి. మొత్తంగా శుక్రవారం నాటిక 25 లక్షల మార్కును దాటింది అగ్రరాజ్యం. దాని వెనకే నడుస్తోంది దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్. అక్కడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

అందుకేనా?

అమెరికాలో కేసుల తీవ్రత పెరగడానికి కారణాలూ లేకపోలేదు. ఈ మధ్యే కొన్ని రాష్ట్రా లు లాక్ డౌన్ నుంచి సడలింపులిచ్చాయి. బతుకు బండి నడిచేందుకు బిజినెస్లకు పర్మిషన్లు ఇచ్చాయి. వాటితోపాటే బార్లు, పబ్బులూ ఓపెన్ చేసుకునేందుకూ ఓకే చెప్పాయి. ఇప్పుడు కరోనా కేసులు పెరగడానికి అదే కారణమన్నవాదనలు వినిపిస్తున్నాయి. సాయంత్రం కాగానే యువత పబ్లు, బార్ల దారులు పడుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇటు పోలీసుల దుశ్చర్యతో మరణించిన జార్జ్ ప్లాయిడ్ కోసం అమెరికా యూత్ రోడ్డెక్కింది. ఆ ఆందోళనలూ కరోనా తీవ్రత పెర గడానికి కారణమైందన్న ఆరోపణలున్నాయి. ఇటీవలే ఆ నిరసనకారుల్లో 15 శాతం మందికి కరోనా సోకిందన్న రిపోర్టులూ వచ్చాయి. ఎక్కడికక్కడ రిలాక్సేషన్స్ఇవ్వడంతో బీచ్ పార్టీలూ పెరిగాయంటున్నారు. కేసులు ఎక్కువవుతున్నా జనం నిర్లక్ష్యంగా ఉంటున్నారు. లాక్డౌన్ ఎత్తేసేందుకు అక్కడ ఎన్ని ఆందోళనలు జరిగాయో గుర్తుండే ఉంటుంది. కొంతమంది తుపాకులు పట్టుకుని రోడ్లపైకి వచ్చిన సందర్భాలున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా లాక్ డౌన్ ఎత్తేసేందుకే మొగ్గుచూపారు. అన్నికారణాలూ కరోనా కేసులు పెరగడానికి ఆజ్యం పోశాయి.

వేరే రాష్ట్రాల్లో పెరుగుతున్నయ్

అమెరికా కరోనా కేసులకు ఎపి సెంటర్ న్యూయార్క్ . అక్కడే దాదాపు 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కాలిఫోర్నియా లో 2 లక్షల ప్లస్ కేసులున్నాయి. అయితే, ఎపిసెంటర్ అయిన న్యూ యార్క్ లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజులుగా అక్కడ వెయ్యిలోపే కేసులు వస్తున్నాయి. కానీ, కాలిఫోర్నియా, టెక్సస్ , ఫ్లోరిడా, అరిజోనా వంటి రాష్ట్రాల్లో తీవ్రత పెరుగుతోంది. అరిజోనా తప్ప మిగతా మూడు రాష్ట్రాల్లో రోజూ 5 వేలకుపైనే కేసులు నమోదవుతున్నాయి. రోజూ చనిపోతున్న వాళ్లూ అక్కడే ఎక్కువగా ఉంటున్నారు.

2 కోట్ల మందికి వచ్చి ఉండొచ్చు

దేశంలో ఇప్పటిదాకా 25 లక్షల 4 వేల 676 మంది కరోనా బారిన పడగా, లక్షా 26 వేల 785 మంది చనిపోయారు. అయితే, కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య 2 కోట్లకు పైనే ఉండి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.  సెంటర్ పర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) చీఫ్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్  స్వయంగా ఈ మాటలు అన్నారు. ఇప్పుడు వెలుగు చూస్తున్న ప్రతి కేసుకూ, పది రెట్ల కేసులు ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.

బ్రెజిల్లోనూ రోజూ 40 వేలు

అమెజాన్ అడవులు కాలిపోవడం దగ్గర్నుంచి ఇప్పుడు కరోనా వైరస్ కేసుల దాకా దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ వార్తల్లో ఉంటోంది. నిజానికి మొదట్లో బ్రెజిల్లో అంతగా కేసులు లేవు. కానీ, మే మధ్య నుంచి పరిస్థితి మారిపోయింది. కేసులు విపరీతంగా పెరిగాయి. మే 30న తొలిసారి ఒక్కరోజులో 30 వేల కేసుల మార్కును అందుకుంది. అప్పటి నుంచి కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి 40 వేల కన్నా ఎక్కువ కేసులు వస్తున్నాయి. జూన్ 19న రికార్డ్ స్థాయిలో ఒక్కరోజే 55,209 కేసులు నమోదయ్యాయి. ఏ దేశంతో పోల్చినా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే రికార్డ్. ఇటు మరణాలూ రోజూ వెయ్యికిపైనే నమోదవుతున్నాయి. ఇప్పటి దాకా అక్కడ 12 లక్షల 33 వేల 147 మంది కరోనా బారిన పడగా, 55,054 మంది చనిపోయారు.

Latest Updates