క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్: ఐపీఎల్ టికెట్ల సేల్స్‌పై బ్యాన్!

క్రికెట్ అభిమానులకు ఏడాదికోసారి వచ్చే అతి పెద్ద సంబరం.. ఐపీఎల్. కానీ ఈ ఏడాది ఆ క్రికెట్ ఫెస్టివల్‌కు బ్రేక్ పడే చాన్స్ ఉందని అనుమానాలు మొదలయ్యాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో సామాన్యులే గుంపుగా జనం ఉన్న చోటుకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ సమయంలో మార్చి 29న ( షెడ్యూల్ ప్రకారం) ఐపీఎల్-13 ప్రారంభం కాబోతోంది. ముంబైలో తొలి మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. అయితే వైరస్ వ్యాప్తి భయంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకంపై నిషేధం విధించినట్లు సమాచారం అందుతోంది. భారీగా జనంతో కూడిన ఎలాంటి ఈవెంట్స్‌కు పర్మిషన్ ఇవ్వకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐపీఎల్ టికెట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేపు కేబినెట్ సమావేశమై.. ఐపీఎల్ మ్యాచ్‌ల రద్దు లేదా వాయిదాపై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే చెప్పారు.

ఇదే బాటలో కర్ణాటక కూడా

కర్ణాటక ప్రభుత్వం కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో ఆంక్షలు పెట్టేందుకు యోచిస్తోంది. గతవారంలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వ సలహా కోరింది ఆ రాష్ట్ర సర్కారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా బెంగళూరులో జరగబోయే మ్యాచ్‌లను నిలిపేసే విషయమై కేంద్రానికి లేఖ రాసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముంబైలో మ్యాచ్‌లను నిలిపేయాలని నిర్ణయం తీసుకుందని, తాము కూడా బెంగళూరులో మ్యాచ్‌లను ఆపేసేందుకు కేంద్రం సలహా కోరుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు కర్ణాటక మంత్రి కె.సుధాకర్. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఐపీఎల్ మ్యాచ్‌లను నిలిపేసేందుకు మహారాష్ట్ర తీసుకునే తుది నిర్ణయాన్ని తాము కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రెటరీ జావెద్ అక్తర్.

Latest Updates