వణుకుతోంది దునియా: వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్

ప్రపంచవ్యాప్తంగా 1.67 లక్షల మందికి కరోనా
కొన్ని దేశాల్లో చైనా కంటే వేగంగా వ్యాపిస్తున్న వైరస్
160 దేశాలకు పాకిన కరోనా.. మొత్తం 7,007 మంది మృతి
వేలాది మందికి సీరియస్.. పెరుగుతున్న కేసులు, మరణాలు
ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్​లో వేగంగా విస్తరిస్తు న్న వైరస్

కరోనావైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. సోమవారం నాటికి మరో నాలుగు దేశాలకు పాకి.. మొత్తంగా160 దేశాలకు వైరస్ వ్యాపించింది.  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు6,684మంది చనిపోయినట్లు అనధికారికంగా అంచనా వేస్తున్నారు. చైనాలో మొదలైన ఈ వైరస్.. ఇప్పుడు ఆ దేశానికి మించి ప్రపంచాన్ని కమ్మేస్తోంది. మరణాల పరంగానూ.. పాజిటివ్​ కేసుల పరంగానూ ఇప్పుడు కరోనా వైరస్​ చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటి వరకూ నమోదైన మరణాలు, కేసులకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ నమోదవుతున్నాయి. సోమవారం నాటికి చైనీస్​ నేషనల్ హెల్త్​కమిషన్​డేటా ప్రకారం ఆ దేశంలో కరోనా పాజిటివ్​ కేసులు 80,880 దగ్గర ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య 87 వేలను దాటేసిందని జాన్స్​ హాప్కిన్స్​యూనివర్సిటీ ట్రాకర్ వెల్లడించింది. సోమవారం నాటికి చైనాలో కొవిడ్–19 మరణాల సంఖ్య 3,213(హాంకాంగ్​లో 4, తైవాన్​లో ఒక మరణాలు కాకుండా)గా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 3,241 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. చైనాలో సోమవారం కొత్తగా14 కరోనా మరణాలు రికార్డయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 123 మందికి, చైనా మెయిన్​ల్యాండ్​లో16 మందికి పాజిటివ్​ అని తేలింది.

యూరోప్​లో కరోనా టెర్రర్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను చూస్తుంటే చైనాలో మొదలైన టైమ్ కంటే వేగంగా కరోనా విస్తరిస్తోందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ రీసెర్చర్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా తర్వాత అత్యంత ఎక్కువ ప్రభావం పడింది ఇటలీపైనే. ఇక్కడ దాదాపు 25 వేల మందికి కరోనా సోకినట్టు తేలింది. మరణాల సంఖ్య కూడా 1,800 దాటింది. మొత్తంగా యూరోప్​లో పరిస్థితి భయానకంగా ఉందని వరల్డ్​హెల్త్​ఆర్గనైజేషన్​ పేర్కొంది. ఫ్రాన్స్​లో 5,423 పాజిటివ్​ కేసులు,127 మరణాలు, జర్మనీలో 5,700 కేసులు,11 మరణాలు, నెదర్లాండ్స్​లో 2,270 కేసులు, 20 మరణాలు, స్విట్జర్లాండ్​లో 2,200 కేసులు, 14 మరణాలు, యూకేలో 1,144 కేసులు, 21 మరణాలు రికార్డయ్యాయి. స్పెయిన్​లో 24 గంటల్లోనే వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8,744కు చేరింది. సోమవారం 9 మంది చనిపోగా.. మొత్తం 297 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్​లో ఒక్క రోజే 129 మరణాలు

ఇటలీ తర్వాత అతి ఎక్కువ కరోనా ప్రభావం ఉన్న దేశం ఇరాన్. ఇక్కడ 15 వేలకు పైగా కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 853 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే 129 మంది మృత్యువాత పడ్డారు. బలహీనమైన ఆర్థిక పరిస్థితులు, మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇరాన్​లో భయాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్​ తో మరణించిన వారిని సామూహిక దహన సంస్కరాలు నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలో 350 మందికి, కెనడాలో 313 మందికి పాజిటివ్​ వచ్చింది.

కంట్రోల్​ చేసేందుకు యూఎస్​ ప్రయత్నాలు

అమెరికాలో కూడా కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ట్రంప్​ సర్కారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో 3,800 పాజిటివ్​ కేసులు, 69 మరణాలు రికార్డయ్యాయి. ట్రంప్ నేషనల్​ఎమర్జెన్సీని ప్రకటించినా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మరోవైపు కరోనా కంట్రోల్​కు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ట్రంప్​ తో పాటు ఆయన సర్కార్​పైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు వారాల క్రితం15 పాజిటివ్​ కేసులు నమోదు కాగా, ఈ సంఖ్య త్వరలోనే జీరోకు చేరుతుందని ట్రంప్​ చెప్పారు. కానీ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో ట్రంప్​పై విమర్శల వాన కురుస్తోంది. దీంతో కరోనా నెపాన్ని డెమొక్రాట్లపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. అతి త్వరలోనే దీనికి వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.  మరోవైపు వచ్చే ఎనిమిది వారాల పాటు 50 మందికి మించి జనం ఎక్కడా గేదర్​ కావొద్దని సెంటర్స్​ ఫర్​ డిజాస్టర్​ కంట్రోల్​అమెరికన్లను ఆదేశించింది.

సౌతాఫ్రికాలో ‘నేషనల్ డిజాస్టర్’గా కరోనా..

సౌతాఫ్రికా కరోనాను నేషనల్​ డిజాస్టర్​గా ప్రకటించింది. కరోనా నియంత్రణకు సంబంధించి దేశ్యాప్తంగా పలు కీలక చర్యలు తీసుకుంది. సౌత్​ కొరియాలో పాజిటివ్​ కేసుల సంఖ్య 8 వేలు దాటడంతో అది మరింత విస్తరించకుండా ఆ దేశ ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం, క్వారెంటైన్​ మెజర్స్​ చేపట్టింది. దీంతో మూడు రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే సియోల్​కు సమీపంలోని ఓ చర్చి పాస్టర్​తో పాటు 40 మందికి కరోనా ఉన్నట్టు తేలింది.

ఏ దేశం.. ఏ చర్యలు తీసుకుందంటే..

మంగళవారం నుంచి వాషింగ్టన్, న్యూయార్క్ లో రెస్టారెంట్లు, బార్లు, కేఫ్​లపై ఆంక్షలు పెట్టారు. టేక్​ అవే, డెలీవరీలను మాత్రమే చేస్తారు. నైట్​ క్లబ్​లు, మూవీ థియేటర్లు, జిమ్​లు మొదలైన వాటిని మార్చి చివరి వరకూ పూర్తిగా క్లోజ్ చేస్తారు. లాస్​ ఏంజిల్స్​లోని హోటల్స్, కాసినోల్లో ఆపరేషన్లు ఆపేశారు. ఆస్ట్రేలియా రిజర్వ్​ బ్యాంకు ప్రభుత్వ బాండ్లను బ్యాంకులు, పెన్షన్​ ఫండ్ల ద్వారా కొనాలని నిర్ణయించింది. మంగళవారం ఆ దేశ షేర్​ మార్కెట్ 9.7 శాతం డౌన్​ అయ్యింది. పబ్లిక్​ ఫంక్షన్లలో జనం 500కు మించవద్దని న్యూజిలాండ్​ ఆంక్షలు పెట్టింది. ​ బ్రిటన్​లో 70 ఏండ్లు మించిన వారు4 నెలలు పాటు సెల్ప్​ ఐసోలేషన్​లో ఉండాలని ఆదేశించింది. వైరస్​ నుంచి వారిని రక్షించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్, బెల్జియం, లక్సెంబర్గ్ బార్లు, రెస్టారెంట్లను పూర్తిగా మూసేయాలని నిర్ణయించాయి.

Latest Updates