కోవిడ్ -19ను కట్టడి చేయగలిగాం.. వైరస్ వ్యాపించడం తగ్గింది

దేశంలో కరోనా వైరస్ ( కోవిడ్ – 19 ) వ్యాప్తి మామూలుగా ఉందని తెలిపారు ఎంపవర్డ్ కమిటీ-2 చైర్మన్ సీకే మిశ్రా.  గత 24 గంటలలో 1409కేసులు మరియు 41మరణాలు సంభవించాయని చెప్పారు. గురువారం సాయంత్రం ఈ వివరాలను ఆయన తెలియజేశారు. వైరస్ సోకి రికవరీ అయిన వారి సంఖ్య  19.89 శాతానికి పెరిగిందని… ఇప్పటివరకు 4వేల 257మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. గత 14రోజులలో 23 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 78జిల్లాల నుండి కేసులు నమోదు కాలేదని చెప్పారు. దీంతో పాటు 28రోజుల వ్యవధిలో 28జిల్లాలనుంచి కూడా కేసులు నమోదు కాలేవని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ పొడిగించడం వలన కరోనా కట్టడి కాగలిగిందని అన్నారు.

కరోనా కేసుల పెరుగుదల మామూలుగా ఉందని తెలిపారు మిశ్రా. లాక్ డౌన్ చేసిన మొదటి 30రోజులలో తాము కరోనా ఎక్కువగా వ్యాపించకుండా ఆపగలిగామని ఆయన అన్నారు. దీంతో పాటు కోవిడ్ -19 పరీక్షలు వేగవంతంగా చేయగలిగామని తెలిపారు. పేషెంట్స్‌ను దృష్టిలో ఉంచుకుని టెస్ట్‌లు నిర్వహించడానికి 3,500 ల్యాబ్‌లను, 3,700 హాస్పిటల్స్‌తో పాటు దాదాపు లక్ష ఐసోలేషన్ పడకలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని ఆయన చెప్పారు.   అయినప్పటికీ మరింత సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తాము చూస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర , గుజరాత్, ఢిల్లీలోని కరోనా వ్యాధిగ్రస్తులు దేశంలో 48శాతం అని చెప్పారు మిశ్రా.

Latest Updates