కరోనా కొమ్ములు విరిచిన కేరళ..56 శాతం రికవర్

న్యూఢిల్లీ:జనవరి 30.. దేశంలో ఫస్ట్​ కరోనా కేసు నమోదైన రోజది. ఆ ఫస్ట్​ కేసు రికార్డ్​ అయింది కేరళలో. ఫస్ట్​ మూడు కేసులు అక్కడే. అది మొదలు ఇప్పటిదాకా రెండున్నర నెలల్లో అక్కడ నమోదైన మొత్తం కేసులు 394. చనిపోయింది ఇద్దరు. 56 శాతం మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గింది. సింగిల్​ డిజిట్​కు వచ్చేసింది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే కేరళ మెరుగైన పొజిషన్​లోనే ఉందని చెప్పొచ్చు. దానికి కారణం ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఓ యంగ్​ డైనమిక్​ కలెక్టర్​ తెలివితేటలే. ఒక్క మాటలో చెప్పాలంటే.. కేరళ సర్కార్​ తీసుకున్న పటిష్టమైన చర్యలే ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని అంతో ఇంతో సేఫ్​జోన్​లో ఉంచాయి.నూహ్​ పులిషెలి బవ (పీబీ నూహ్​).. పథనంథిట్ట కలెక్టర్​. వుహాన్​ నుంచి వచ్చిన ఓ మెడికల్​ స్టూడెంట్​కు కరోనా పాజిటివ్​ రావడంతో రాత్రి 11.30 గంటలకు  చీఫ్​ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్​ పెట్టారు. ఆ ఒక్క కేసుతో మరిన్ని రాకుండా డాక్టర్లు, తోటి అధికారులతో చర్చ నడిచింది. తెల్లవారుజామున 3 గంటలకు  డబ్ల్యూహెచ్​వో సూచించిన ఫార్ములా ఫాలో అవ్వాలని డిసైడ్​ అయ్యారు. కరోనా పాజిటివ్​ వచ్చిన వ్యక్తులను కలిసినోళ్లను గుర్తించడం, వాళ్లను ఐసోలేషన్​కు తరలించడం, వారిపై నిఘా ఉంచడం వంటి వాటిని ఫాలో అయ్యారు. అందుకు పేషెంట్లనే ఆధారంగా చేసుకున్నారు. వాళ్లు ఇచ్చిన వివరాలు, వాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్​ చేశారు. ఎయిర్​పోర్టుల్లో స్క్రీనింగ్​ను స్ట్రిక్ట్​ చేశారు. డౌట్​ వచ్చినవాళ్లను క్వారంటైన్​లో పెట్టారు. పాజిటివ్​గా తేలినోళ్లను ఐసోలేషన్​కు పంపించారు.

ఆ ఫ్యామిలీ సహకరించలేదు

అంతా బాగానే జరుగుతోందనుకున్న టైంలో ఫిబ్రవరి 29న నూహ్​కు సీఎస్​ నుంచి ఫోన్​ వచ్చింది. పథనంథిట్ట జిల్లాలోని రణికి చెందిన ముగ్గురు ఇటలీలోని వెనిస్​ నుంచి వచ్చి… కొచ్చి ఎయిర్​పోర్టులో స్క్రీనింగ్​ టెస్టులను తప్పించుకుని ఓ క్యాబ్​లో 200 కిలోమీటర్ల దూరంలోని రణికి వచ్చారని చెప్పారు. వాళ్లకు టెస్టులు చేస్తే మార్చి 7న ముగ్గురికీ పాజిటివ్​ అని తేలింది. వాళ్ల ఇద్దరు బంధువులకూ వైరస్​ సోకింది. వాళ్లు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరిని కలిశారన్నది మాత్రం అధికారులకు చెప్పలేదు. అధికారులకు సహకరించలేదు. అప్పటికి దేశంలో 31 మందికి వైరస్​ సోకింది. ఇలాంటి టైంలో ఏం చేయాలన్నది నూహ్​కు తోచలేదు.

డిటెక్టివ్​ స్టైల్​లో ట్రేసింగ్​

2018 వరదలప్పుడు నూహ్​కు సహాయ చర్యల్లో పాల్గొన్న అనుభవం ఇక్కడ పనికొచ్చింది.  కరోనా సోకిన ఆ ముగ్గురు ఎలాగూ వివరాలు చెప్పరని నూహ్​కు అర్థమైంది. దీంతో వరదలప్పుడు వాడిన డిటెక్టివ్​ స్టైల్​ వర్క్​ను, టెక్నాలజీని వాడాలని డిసైడ్​ అయ్యారు. పోలీసులు, మెడికల్​ సిబ్బంది, వలంటీర్లతో కూడిన 50 మంది టీమ్​ను రెడీ చేశారు. అందరినీ టీమ్​లుగా విభజించారు. ఆ ముగ్గురి మొబైల్స్​లోని జీపీఎస్​ డేటా, ఎయిర్​పోర్టు, వాళ్లు తిరిగిన వీధులు, స్టోర్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వాళ్లంతా వారంలోనే రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాలను తిరిగేశారు.

రంగంలోకి సర్కార్​

ఈ విషయం తెలిసిన సాయంత్రమే కేరళ సర్కార్​ రంగంలోకి దిగింది. ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వెంటనే పథనంథిట్టకు వచ్చారు. నూహ్​ ఏర్పాటు చేసిన ఒక్కో టీంలో అధికారుల సంఖ్య 6 నుంచి 15కు పెరిగింది. మార్చి 9న ఆ ఫ్యామిలీ 300 మందిని కలిసినట్టు నిర్ధారణకు వచ్చారు. వాళ్లందరినీ ట్రేస్​ చేసిన నూహ్​ టీమ్​.. వాళ్లకున్న లక్షణాలను బట్టి క్వారంటైన్​లో పెట్టడమో లేదంటే జిల్లా ఆస్పత్రికి తరలించడమో చేశారు. టెస్టులూ చేశారు. ఆ టైంకు మొత్తం 1,200 మందిని సెల్ఫ్​ ఐసోలేషన్​లో పెట్టేసింది సర్కార్​. వాళ్లు ఐసోలేషన్​లో ఉంటున్నారన్న గ్యారంటీ లేదు. దీంతో వాళ్ల మీద నిఘా పెట్టేందుకు ఓ కాల్​సెంటర్​ను తన ఆఫీసులో ఏర్పాటు చేశారు. 60 మంది మెడికల్​ స్టూడెంట్లు, డిస్ట్రిక్ట్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ సిబ్బందిని రప్పించారు. ఐసోలేషన్​లో ఉన్న వారికి రోజూ ఫోన్​ చేసి వివరాలు తెలుసుకోవడమే వాళ్ల పని. ఆ ప్రయత్నంలో చాలా మంది అబద్ధాలూ చెప్పారు. అలాంటప్పుడు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీల సహకారం తీసుకున్నట్టు నూహ్​ చెప్పారు. అయితే, ఐసోలేషన్​లో ఉన్నవాళ్లపై నిఘా పెట్టడమే కాదు, వాళ్ల రోజువారీ అవసరాలూ తీరాలి కదా. అందుకే రోజూ వాళ్ల ఇంటికే సరుకులు పంపించారు. జిల్లాను హై అలర్ట్​లో పెట్టారు.

లాక్​డౌన్​ ప్రకటించిన ఫస్ట్​ స్టేట్​

అధికారుల ప్రయత్నాలతో రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మార్చి 11 నాటికి రాష్ట్రంలో 15 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వెంటనే సీఎం పినరయి విజయన్​ రంగంలోకి దిగారు. ఆలస్యం చేయకుండా రాష్ట్రమంతా లాక్​డౌన్​ ప్రకటించారు. దేశంలో ఫస్ట్​ లాక్​డౌన్​ ప్రకటించిన రాష్ట్రంగా కేరళ నిలిచింది. స్కూళ్లను బంద్​పెట్టారు. ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించారు. గుళ్లు, మసీదులు, చర్చిల్లో దర్శనాలు, ప్రార్థనలనూ బ్యాన్​చేశారు. ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా ఆర్డర్స్​ పాస్​ చేశారు. వాళ్లకు మెరుగైన ఇంటర్నెట్​ అందేలా చర్యలు తీసుకున్నారు. హ్యాండ్​ శానిటైజర్లు, మాస్కుల ప్రొడక్షన్​ను పెంచారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని ఇంటికే పంపించే ఏర్పాట్లు చేశారు. 20వేల కోట్లతో రిలీఫ్​ ప్యాకేజీ ఇచ్చారు. ఆరోగ్యానికే ప్రత్యేకంగా 5 వేల కోట్లు కేటాయించారు. ఫ్రీ రేషన్​, లోన్ల కోసం 2 వేల కోట్లు, పల్లెల్లో ఉద్యోగాల కల్పన కోసం 2 వేల కోట్లు, పేదల కోసం వెయ్యి కోట్లు, 1,320 కోట్లను రెండు నెలల అడ్వాన్స్ పెన్షన్ల కోసం కేటాయించారు. 30 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లారు. అనుమానితుల ఆరా తీశారు. ఒక్కో కార్యకర్త రోజూ 200 మందిని కలిశారు. దీంతో సర్కార్​పై ప్రజలకూ నమ్మకం పెరిగింది.

వాళ్ల చదువూ కలిసొచ్చింది

నిజానికి దేశంలో మెరుగైన వైద్య సదుపాయాలున్న రాష్ట్రాల జాబితాలో కేరళ మొదటి స్థానంలో ఉంటుంది. మూడున్నర కోట్ల జనాభా ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో 135 హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి హాస్పిటల్​లో వంద బెడ్లున్నాయి. అందులో 300 వరకు బెడ్లున్నవి 50 వరకున్నాయి. ప్రతి 200 మందికో డాక్టర్​ ఉన్నారు. నర్సులకు కేరళ ఫేమస్​. చాలా చోట్ల కేరళ నర్సులు పనిచేస్తుంటారు. ప్రస్తుతం డాక్టర్లతో పాటు కరోనాపై ముందుండి పోరాడుతోంది నర్సులే. అక్షరాస్యతలోనూ ఆ రాష్ట్రమే ఫస్ట్​. 94 శాతం మంది చదువుకున్నోళ్లున్నారక్కడ. దీంతో వాట్సాప్​లో చక్కర్లు కొట్టే పుకార్లను పక్కనబెట్టి మీడియా కథనాలనే నమ్మారు. మార్చి 23 నాటికి పథనంథిట్ట జిల్లాలో పాజిటివ్​ కేసులు 5 నుంచి 9కి పెరిగాయి. కేసుల కట్టడికి నూహ్​ తీసుకున్న నిర్ణయాలే దానికి కారణమని అంటారు. మార్చి 28 నాటికి రాష్ట్రంలో 1.34 లక్షల మందిని క్వారంటైన్​లో పెట్టారు. 620 మందిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చారు. మిగతా వాళ్లందరినీ ఇళ్లలోనే ఐసోలేట్​ చేశారు. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నోళ్ల సంఖ్య 1.62 లక్షలకు పెరిగింది. కేసులు 394 దగ్గర ఉన్నాయి. ఇప్పటికి అక్కడ చనిపోయింది ఇద్దరే. ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించడం, అన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైందంటారు నూహ్​.

కష్టాలు కేరళకు కొత్తేం కాదు

నిజానికి కేరళకు కష్టాలు కొత్తేం కాదు. కరోనా వైరస్​ కన్నా ముందే ఆ రాష్ట్రంలో నిపా అనే కొత్త వైరస్​ పుట్టింది. గబ్బిలాల నుంచే మెదడును దెబ్బతీసే ఆ వైరస్​ మనుషులకు సోకిందని సైంటిస్టులు తేల్చారు. దానిని సమర్థంగానే ఎదుర్కొంది. ఇప్పుడు చేస్తున్న ట్రేసింగ్​, టెస్టింగ్​, ఐసోలేషన్​లను ఆ టైంలోనే కేరళ పటిష్టంగా పాటించింది. మే 2న ఫస్ట్​ కేసును గుర్తిస్తే జూన్​ 10 నాటికి వైరస్​ను కట్టడి చేయగలిగింది. మొత్తంగా 19 కేసులు రిపోర్ట్​ అయితే 17 మంది చనిపోయారు. నిపా గురించి తెలియగానే దాని ప్రభావం ఉన్న జిల్లాలు, ప్రాంతాలకు ట్రావెల్​పై ఆంక్షలు పెట్టింది సర్కార్​. దాని నుంచి ఇట్ల తేరుకుందో లేదో ఆగస్టులో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఎన్నడూ లేనంతగా ఎప్పుడూ నిండని డ్యాములూ నిండాయి. వరదలై పొంగాయి. ఊళ్లను ముంచేశాయి. రాష్ట్రంలోని 14 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. 483 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కష్టాన్నీ మెరుగ్గానే ఎదుర్కొంది రాష్ట్రం. కొద్ది రోజుల్లోనే వరదల నుంచి తేరుకుంది. బాధితులందరికీ అండగా నిలిచింది. ఇప్పుడు కరోనా సంక్షోభం టైంలోనూ అదే పద్ధతిని ఫాలో అవుతోంది.

Latest Updates