24 గంటల్లో 1409 కొత్త‌ కేసులు న‌మోదు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1409 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 21,393 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. గురువారం మీడియా సమావేశం నిర్వ‌హించిన ఆయ‌న‌.. 12 జిల్లాల్లో గత 28 రోజుల నుంచి ఎక్కడా కొత్త కేసులు నమోదు కాలేదని చెప్పారు. అలాగే, గత 14 రోజుల్లో 78 జిల్లాల్లో కొత్త కేసులు రాలేదని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడినవారిలో 4257 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. ఇప్పటి వరకు 5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దేశ వ్యాప్తంగా నోడల్‌ అధికారుల నియామకం చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది.

లాక్‌డౌన్‌ నుంచి కొన్ని ఉత్పత్తులు, సేవలకు మినహాయింపు కేంద్రం మినహాయింపులు ఇచ్చింది. ఎలక్ట్రికల్ షాపులు, స్టేష‌న‌రీ షాపులు, మొబైల్‌ రీఛార్జ్‌ పాయింట్లకు, రహదారి నిర్మాణ పనులు, సిమెంట్ పరిశ్ర‌మ‌లు, పట్టణ ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే కరోనా హాట్ స్పాట్‌లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ మినహాయింపులు వర్తించవని స్పష్టం చేసింది.

Latest Updates