48 శాతం దాటిన క‌రోనా రి‌కవ‌‌రీ రేటు: టెస్టులు భారీగా చేయ‌డంతో…

దేశంలో క‌రోనా పేషెంట్ల రి‌కవ‌‌రీ రేటు క్ర‌మంగా పెరుగుతోంది. సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు క‌రోనా రిక‌వ‌రీ రేటు 48.19 శాతానికి చేరింది. వైర‌స్ బారిన‌ప‌డినా.. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండ‌గా, మ‌ర‌ణాల రేటు బాగా త‌గ్గుతూ వ‌స్తోంది. దేశంలో ప్ర‌స్తుతం మ‌ర‌ణాల రేటు 2.83 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై సోమ‌వారం వివ‌రాల‌ను వెల్ల‌డ‌లించింది. గ‌డిచిన 24 గంటల్లో 4,835 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం ల‌క్షా 82 వేల మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. అందులో 91,818 మంది కోలుకున్నార‌ని చెప్పింది. పేషెంట్ల రిక‌వ‌రీ రేటు ఏప్రిల్ 15 నాటికి 11.42 శాతం ఉండ‌గా.. అది మే 3కు 26.59 శాతానికి, మే 18 నాటికి 38.29 శాతానికి చేరిందని తెలిపింది. గ‌డిచిన రెండు వారాల్లోపే మ‌రో 10 శాతం పెరిగి.. నేటికి 48.19 శాతానికి క‌రోనా రిక‌వ‌రీ రేటు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్ర‌స్తుతం 93,322 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది.

దేశంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. ఏప్రిల్ 15నాటికి మొత్తం కేసుల్లో 3.3 శాతం పేషెంట్లు క‌రోనాకు బ‌ల‌య్యారు. మే 3నాటికి 3.25 శాతం క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. మే 18 నాటికి 3.15 శాతానికి చేరిన మ‌ర‌ణాల రేటు.. ఇవాళ 2.83 శాతానికి త‌గ్గింది. టెస్టుల సంఖ్య పెంచి స‌రైన స‌మ‌యంలో క‌రోనా పేషెంట్ల‌ను గుర్తించ‌డం ద్వారా మ‌ర‌ణాల‌ను వీలైనంత‌గా త‌గ్గించొచ్చ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొద్ది రోజులుగా టెస్టింగ్ కెపాసిటీ బాగా పెరిగింద‌ని, 472 ప్ర‌భుత్వ‌, 204 ప్రైవేటు ల్యాబ్స్ ద్వారా నిన్న ఒక్క రోజే 1,00,180 శాంపిల్స్ ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది.

Latest Updates