క‌రోనాపై పోరులో త‌ల్లి సేవ‌లు: దూరం నుంచే ఆ బిడ్డను చూసి కంట‌త‌డి.. వీడియో

ప్ర‌పంచం మొత్తాన్ని క‌ల్లోలంలోకి నెట్టేసిన‌ క‌రోనా మ‌హ‌మ్మారిపై డాక్ట‌ర్లు, న‌ర్సులు త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా పోరాడుతున్నారు. వైర‌స్ సోకిన పేషెంట్లను కాపాడ‌డానికి రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. త‌మ భార్య‌/భ‌ర్త‌, పిల్ల‌ల‌కు దూరంగా ఉంటూ మ‌న కుటుంబాల కోసం త్యాగాలు చేస్తున్నారు. క‌రోనా పేషెంట్ల‌కు ట్రీట్మెంట్ చేస్తూ.. ఆ ఇన్ఫెక్ష‌న్ ఎక్క‌డ ఇంటికి మోసుకెళ్తామోన‌న్న భ‌యంతో.. హాస్పిట‌ల్ నుంచి ఇంటికి కూడా వెళ్ల‌డం లేదు కొంద‌రు వైద్య సిబ్బంది. డ్యూటీ పూర్త‌య్యాక కూడా కుటుంబంతో సంతోషంగా గ‌డ‌ప‌లేక‌పోతున్నారు. త‌మ పిల్ల‌ల్ని ద‌గ్గ‌ర‌కు తీసుకుని లాలించ‌లేక త‌ల్లిడిల్లిపోతున్నారు. క‌ర్ణాట‌క‌లోని బెల‌గావిలో ఓ నర్సు ఎదుర్కొంటున్న ఇలాంటి ప‌రిస్థితి చూస్తే ఎవ‌రికైనా క‌న్నీళ్లు ఆగ‌వేమో.

15 రోజులుగా ఇంటికెళ్ల‌ని అమ్మ‌.. త‌ల్ల‌డిల్లిపోయిన చిట్టిత‌ల్లి

క‌ర్ణాట‌క‌లోని బెల‌గావిలో బెల‌గావి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ హాస్పిట‌ల్ లో సుగంధ‌ అనే మ‌హిళ న‌ర్సుగా ప‌ని చేస్తోంది. క‌రోనా వైర‌స్ సోకిన పేషెంట్లకు సేవ‌లు అందిస్తోందామె. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారిపై ఏ మాత్రం భ‌యం లేకుండా పోరాడుతోంది. వార్డులో డ్యూటీ పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆమె ఇంటికి కూడా వెళ్ల‌డంలేదు. క‌రోనాను ఫ్రంట్ లైన్ లో ఉండి ఎదుర్కొంటున్న ఆమె.. వైర‌స్ బారిన‌ప‌డే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉండ‌డంతో హాస్పిటల్ ద‌గ్గ‌ర ఏర్పాటు చేసిన హాస్ప‌ల్ లోనే ఉంటోంది. దాదాపు ఆమె త‌న కుటుంబాన్ని క‌లిసి 15 రోజులు దాటిపోయింది.

సుగంధ‌కు నాలుగేళ్ల కూతురు ఉంది, ఆ చిట్టిత‌ల్లి ఆల‌నాపాల‌న‌ ఈ రెండు వారాలుగా తండ్రి చేసుకుంటున్నాడు. సాయంత్ర‌మైతే ఆమ్మ ఒడిలో ఆడిపాడే ఆ చిన్నారికి ఇన్ని రోజుల‌గా త‌ల్లి క‌నిపించ‌డ‌పోవడంతో బెంగ పెట్టేసుకుంది. క‌రోనాపై సుగంధ‌ చేస్తున్న పోరాటాన్ని ఏమ‌ని చెప్ప‌ ఆ చిట్టిత‌ల్లిని ఊర‌డించ‌గ‌ల‌డు ఆ తండ్రి. అమ్మ‌ను చూడాల‌ని మెండికేయ‌డంతో తండ్రి బైక్ పై ఎక్కించుకుని ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అక్క‌డ త‌ల్లిని దూరం నుంచి చూసిన ఆ ప‌సికందు.. ఏడుస్తూ అమ్మా.. అమ్మా అంటూ ద‌గ్గ‌ర‌కు పిలిచింది. బిడ్డ‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకోవాల‌ని లోప‌ల ఉన్నా వైర‌స్ భ‌యంతో దూరంగానే ఆగిపోయింది ఆ త‌ల్లి. కూతురిని ఎత్తుకుని బుజ్జ‌గించ‌లేని త‌న స్థితికి ఆ త‌ల్లి కంట‌నీరు ఆగ‌లేదు. ఎదురుగానే ఉంటే అమ్మ ద‌గ్గ‌ర‌కు రావ‌డం లేద‌న్న బాధ‌తో ఆ చిన్నారి ఇంకా త‌ల్లడిల్లిపోతుంద‌ని బై.. అంటూ టాటా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తూ క‌న్నీరు తుడుచుకుంటూ ఆస్ప‌త్రి ఎదుట నిల‌బ‌డిపోయింది ఆ త‌ల్లి. ఈ ఘ‌ట‌న‌ను కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఆ మాతృమూర్తి సేవ‌ల‌కు సెల్యూట్ చేస్తున్నారు.

సుగంధ‌కు ఫోన్ చేసిన ముఖ్య‌మంత్రి

ఆ త‌ల్లీబిడ్డ‌ల బాధ‌ను స్థానిక మీడియా ప్ర‌సారం చేయ‌డంతో అది క‌ర్ణాట‌క సీఎం య‌డ్యూర‌ప్ప దృష్టికి చేరింది. దీంతో ఆయ‌న సుగంధ‌కు ఫోన్ చేసి ఆమె సేవ‌ల‌ను ప్ర‌శంసించారు. బిడ్డ‌ను కూడా చూడ‌కుండా క‌రోనా మ‌హమ్మారిపై పోరాడుతున్న తీరును ఆయ‌న ఎన్న‌టికీ గుర్తుంచుకుంటాన‌ని చెప్పారు. ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్నార‌ని, ఓపిక‌గా ఈ సేవ‌ల‌ను కొన‌సాగించాల‌ని కోరారు సీఎం. భ‌విష్య‌త్తులో మీకు మంచి జ‌రుగుతుంద‌ని ధైర్యం చెప్పారు.

Latest Updates