కరోనా వైరస్‌ చైనా ల్యాబ్‌ నుంచి లీక్ అయిందా?

న్యూఢిల్లీ: చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కొత్త వైరస్ కరోనాపై వస్తున్న రకరకాల కథనాలపై భారత్‌లోని చైనా రాయబారి సున్ వైడాంగ్ స్పందించారు. వైరస్ చాలా భయంకరమైనదని, అయితే దానిపై వస్తున్న పుకార్లు ఇంకా ఘోరమని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కరోనా వైరస్‌ను చైనా కావాలని ల్యాబ్‌లో తయారు చేసిందని, పొరబాటున తమ దేశంలోనే బయటకు వ్యాప్తి చెందిందని కథనాలు వస్తున్న నేపథ్యంలో దీనిపై విలేకర్లు ప్రశ్నించారు. వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో తయారు చేశారా అని అడగగా.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు సున్ వైడాంగ్. ఈ వైరస్ సహజంగా పుట్టినదేనని తెలిపారు. ఈ వైరస్ గురించి ఇంకా పూర్తి స్థాయిలో తమకు కూడా తెలియదన్నారు.

భారత్‌కు థ్యాంక్స్

కరోనా వైరస్‌పై పోరాడుతున్న చైనాకు భారత్ అందిస్తున్న సాయంపై ధన్యవాదాలు తెలిపారు చైనా రాయబారి సున్. ఈ కష్ట సమయంలో భారత్ తమ పట్ల చూపిస్తున్న దయ తనను భావోద్వేగానికి గురి చేస్తోందన్నారు. 2003లో సార్స్ వ్యాధి ప్రబలిన సమయంలోనూ భారత్ ఇలానే అండగా నిలిచిన ఘటన ఈ సందర్భంగా తనకు గుర్తొస్తోందన్నారు.  నాడు భారత విదేశాంగ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలోని బృందాన్ని తాను సార్స్ వైరస్ పుట్టిన సిటీ షాంఘైలో రిసీవ్ చేసుకున్నది ఇప్పటికీ జ్ఞాపకం ఉందని చెప్పారు. ఇప్పుడు కరోనాపై పోరాటంలోనూ తమకు పూర్తిగా అండగా నిలుస్తామని భారత ప్రభుత్వం తెలిపిందన్నారు. ఈ విషయంపై ఇటీవల ప్రధాని మోడీ తమ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.

మంగళవారం నాటికి చైనాలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 73 వేలకు చేరగా.. మృతుల సంఖ్య 2 వేలకు చేరింది.

Latest Updates