కరోనా ఎఫెక్ట్: మరో రెండు దేశాలకు వీసాలపై భారత్ కీలక నిర్ణయం

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19)ను భారత్‌లో వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ వైరస్ బారిన పడిన దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల స్క్రీనింగ్ సహా చైనీయులు, ఆ దేశం నుంచి వచ్చేవారికి ఈ-వీసాలను నిలిపివేసింది. ఇప్పుడు తాజాగా జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. ఆ రెండు దేశాల ప్రజలకు ఉన్న ప్రత్యేక సౌకర్యాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ రెండు దేశాల వారు తమ పాస్‌పోర్టుతో భారత్ వచ్చి ఆన్ అరైవల్ వీసా తీసుకునే సదుపాయం ఉండేది. ఈ సేవలను కొన్నాళ్ల పాటు నిలిపేస్తున్నామని భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది.

చైనా తర్వాత దక్షిణ కొరియాలోనే..

చైనాలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 2788 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కోవిడ్-19 చికిత్స పొందుతున్న వాళ్లు 78,824 మంది ఉన్నారక్కడ. ఆ దేశం తర్వాత దక్షిణ కొరియాలోనే అత్యధిక మంది వైరస్ బారిన పడి బాధపడుతున్నారు. దాదాపు 2 వేల మంది కోవిడ్-19 బారిపడగా.. 13 మంది మరణించారు. అలాగే చైనా నుంచి జపాన్ వెళ్లిన భారీ షిప్ డైమండ్ ప్రిన్సెస్‌లో మొత్తం 3711 మంది ఉండగా.. వారిలో  700 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. వారికి ఆ దేశం జపాన్ చికిత్స అందిస్తోంది. ఆ షిప్‌లో చిక్కుకున్న 119 భారతీయులను, ఐదురుగు విదేశీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో నిన్న భారత్‌కు తీసుకొచ్చింది.

Latest Updates