పోలీసులకు స్మార్ట్ హెల్మెట్.. రోడ్లపై తిరిగే కరోనా పేషెంట్లను పట్టేస్తరు!

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది ప్రాణాంతక కరోనా వైరస్. ప్రపంచ వ్యాప్తంగా దీని బారిన పడి దాదాపు 3500 మంది మరణించారు. ఒక్క చైనాలోనే 3100 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 92 దేశాల్లో లక్ష మంది వరకు చికిత్స పొందుతున్నారు. భారత్‌లోనూ ఇటీవల వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో కలిసిన వ్యక్తులే ఉన్నారు.

నియంత్రణకు అన్ని చర్యలు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఎయిర్‌పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చేవారిని స్క్రీనింగ్ చేశాకే బయటకు పంపుతున్నారు ఆయా దేశాల అధికారులు. అలాగే ప్రజలకూ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు మోచేయి లేదా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలని సలహాలిస్తున్నారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం ఇలా కరోనా లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే డాక్టర్లను కలవాల్సిందిగా సూచించారు. కానీ, జలుబు, దగ్గునే కదా అని ఎవరైనా తేలికగా తీసుకుంటే.. పొరబాటున వారికి కరోనా సోకినట్లైతే అది మరింత మందికి వ్యాపించే ప్రమాదం ఉంది.

స్మార్ట్ గా లక్షణాల గుర్తింపు

కరోనా లక్షణాలన్నీ సీజన్ మార్పులతో చాలా సాధారణంగా కనిపించేవే. వైరస్ సోకిన మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తాయి. ఇవి మామూలుగా వచ్చి ఉంటాయని కొద్ది రోజులు లైట్ తీసుకుని.. పబ్లిక్ ప్లేసుల్లో తిరిగితే వైరస్ బారిన పడేవారి సంఖ్య భారీగా పెరిగే చాన్స్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చైనా ‘టెక్నాలజీ’తో ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. పోలీసులకు స్టార్ట్ ‘ఇన్‌ప్రారెడ్’ కెమెరాతో కూడిన హెల్మెట్లు అందజేసింది. వాటిని పెట్టుకుని రోడ్లపైకి వచ్చిన జనాల్ని సైతం స్క్రీనింగ్ చేస్తోంది. గుంపులో తిరుగుతున్న వారిలో ఎవరి శరీర ఉష్ణోగ్రత ఎలా ఉందన్నది గుర్తించి.. ఏ మాత్రం నార్మల్ టెంపరేచర్‌ కంటే ఎక్కువగా ఉన్నా ఆస్పత్రులకు తరలిస్తున్నారు పోలీసులు. కరోనా అనుమానితులను పట్టుకుని క్వారంటైన్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తున్నారు.

ఈ స్మార్ట్ హెల్మెట్‌తో పోలీసులు రోడ్లపై స్క్రీనింగ్ చేస్తున్న పోలీసుల వీడియోను చైనా న్యూస్ పేపర్ ‘ది పీపుల్స్ డైలీ’ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కరోనా వైరస్‌ను త్వరలోనే ఓడించబోతున్నామంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ఈ టెక్నాలజీ సూపర్, కానీ ఈ రకమైన హెల్మెట్లను అన్ని దేశాలు వినియోగించలేకపోవడం బాధాకరమని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

Latest Updates