కరోనా – జాగ్రత్తలు: ఫోన్లు, కంప్యూటర్ కీబోర్డ్స్ క్లీన్ చేసేదెలా?

చైనాలో పుట్టిన కరోనా వైరస్ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తూ ప్రజల్ని వణికిస్తోంది. భారత్‌లోనూ రోజు రోజుకీ కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ వేగంగా వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూనే ఉంది. దీని బారినపడకుండా ఉండాలంటే వ్యక్తిగతంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవడం లాంటి చేయాలి. అయితే ఆఫీసుల్లో, ఇంట్లో ఒకే కంప్యూటర్‌ను వేర్వేరు వ్యక్తులు వాడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు కీబోర్డ్‌ను రోజులో ఒక్కసారైనా క్లీన్ చేసుకోవడం మేలు. అలాగే మొబైల్ ఫోన్స్‌ కూడా శుభ్రం చేయాలి. మరి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం.

– ప్లాస్టిక్, ఐరన్ వస్తువులపై సుమారుగా ఏడు నుంచి తొమ్మిది రోజుల వరకు కరోనా వైరస్ బతికే చాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

– కరోనా పేషెంట్లు తాకితేనప్పుడు లేదా వాళ్లు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్లు వస్తువులపై పడినప్పుడు మాత్రమే వాటిపై వైరస్ చేరుతుంది.

– ఆఫీసులు, ఇళ్లో తరచూ చేతులు కడుక్కోవడంతో పాటు.. ఫోన్లు, కంప్యూటర్/ల్యాప్ టాప్ కీ బోర్డును కూడా డిసిన్ఫెక్ట్ చేసుకోవడం మేలు.

– అయితే ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై నేరుగా డిసిన్ఫెక్ట్ లిక్విడ్ స్ప్రే చేయకూడదు.

– మెత్తటి గుడ్డ తీసుకుని దానిపై శానిటైజర్‌ను స్ప్రే చేసి కీ బోర్డు, ఫోన్లను జాగ్రత్తగా తుడవాలి. రోజులో ఒక్కసారి ఇలా చేస్తే చాలు.

– ఫోన్ స్క్రీన్, వెనుక వైపుతో పాటు ఫోన్ కేస్‌ను కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే లాక్ బటన్, వాల్యూమ్ బటన్స్, హోం బటన్ మర్చిపోకుండా శుభ్రం చేసుకోవాలి.

– వీలైనంత వరకు ఫోన్ ముఖానికి టచ్ కాకుండా చూసుకోవాలి. ఫోన్ మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ లాంటివి పెట్టుకుంటే మేలు.

కరోనా వైరస్ బారినపడ్డ వారికి ఉండే లక్షణాలు: జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు

వైరస్ వ్యాపించేదిలా: అల్రెడీ వైరస్ బారినపడ్డ వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు పైన పడినా, లేదా నేరుగా వాళ్లను తాకినా ఇతరులకు కరోనా వచ్చే అవకాశం ఉంది. ఆ తుంపర్లు పడిన చేతులతో మన కళ్లు, ముక్కు, నోటిని టచ్ చేస్తే వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

– వైరస్ వ్యాప్తి నివారణకు ఉత్తమ మార్గం.. సబ్బు లేదా శానిటైజర్‌తో రోజులో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడమే. 

– తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్/టీష్యూ పేపర్ లేదా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. చేతులను కడుక్కోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకొద్దు.

– ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు. నమస్తే అని పలకరించడమే బెస్ట్.

– ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్నాయనిపించినా ఇతరులను కలవొద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

– రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు.

– ఎవరికైనా జలుబు, దగ్గు ఉంటే మాస్క్ వాడడం మేలు.

– ఇతరులకు కనీసం రెండు మీటర్ల దూరం పాటించండి

Latest Updates