కరోనాపై ఫైట్.. WHO ‘సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్’

ఇప్పటివరకూ సోషల్  మీడియాలో ఎన్నో రకాల ఛాలెంజ్‌లు చూశాం. హరితహారం, ఐస్ బకెట్ , ఫిట్ నెస్.. ఇలా పలు రకాల చాలెంజ్‌లను వీడియో యాప్‌లైన ట్విటర్, టిక్ టాక్ లలో కొందరు ప్రముఖులు చేశారు. వారంతా ఆ చాలెంజ్ ని స్వీకరించి మరికొంత మందికి చాలెంజ్ ను విసిరారు.  ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)  ప్రారంభించింది. అయితే ఇదేదో సరదాగా చేసే ప్రయత్నం కాదు. ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్య కరోనా వైరస్.

విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు యావత్ ప్రపంచమంతా నానా తంటాలు పడుతున్న క్రమంలో WHO..  ట్విటర్  వేదికగా ఓ ఛాలెంజ్ ను ప్రారంభించింది. ఈ నెల 13 న WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయెసస్  సేఫ్ హ్యాండ్స్ (#SafeHands)  అనే సోషల్  మీడియా ప్రచారాన్ని ప్రారంభించారు. ట్విటర్ లో తన చేతులు శుభ్రపరుచుకుంటున్న వీడియోని షేర్ చేశారు. ట్యాప్ ఓపెన్ చేసి చేతులను సబ్బుతో కానీ, ఆల్కహాల్ తో గానీ శుభ్రం చేసుకోవాలని చెబుతూ.. మొత్తం 11 స్టెప్స్ ఫాలో అవ్వాలని వీడియోలో చూపారు.  తన ఫాలోవర్స్ తో పాటుగా కొందరి ప్రముఖులను(క్రీడాకారులు, సినీ నటులు) కూడా ఇలాగే తమ వీడియోలను తీసి షేర్ చేయాలని ఛాలెంజ్ చేశారు టెడ్రోస్ . వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఈ ఛాలెంజ్ ని స్వీకరించాలని, ప్రపంచానికి తమ శుభ్రపరచిన చేతులని చూపాలని కోరారు.

4 రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోని 1.3 మిలియన్ల మంది వీక్షించారు. 13.4 వేల మంది ఈ వీడియోకి రీట్వీట్లు చేశారు. ఈ చాలెంజ్‌ను ఇంకా మన వరకూ రాలేదు. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 6,000 మందికి పైగా మరణించడంతో, వైరస్ నివారణకు  ఎప్పటికప్పుడు పూర్తిగా చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Latest Updates