బ్యాంకులను కొల్లగొడుతున్నకార్పొరేట్ ఫ్రాడ్స్

ముంబై : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌ ఎస్‌‌బీఐని మోసగించే కార్పొరేట్ల సంఖ్య పెరుగుతోంది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే… ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో ఎస్‌‌బీఐలో మోసాలు మూడింతలు పెరిగాయి. ఎస్‌‌బీఐ కార్డ్స్ ఐపీఓ డాక్యుమెంట్‌‌ డేటాలో ఈ విషయాన్ని ఎస్‌‌బీఐ బహిర్గతం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో రూ.26,757కోట్ల కార్పొరేట్ ఫ్రాడ్స్‌‌ను గుర్తించి, రెగ్యులేటర్స్ వద్ద రిపోర్టు చేశామని ఎస్‌‌బీఐ తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎస్‌‌బీఐలో రూ.10,725 కోట్ల కార్పొరేట్ మోసాలు జరిగాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో అయితే రూ.146 కోట్ల మోసాలే జరిగాయి. మోసాలకు దారితీసిన సందర్భాలు కూడా 25 నుంచి 48కి పెరిగాయని కూడా ఎస్‌‌బీఐ తెలిపింది. రూ.100 కోట్ల విలువైన మోసాలనే ఎస్‌‌బీఐ తన డేటాలో పేర్కొంది. మోసాలను రిపోర్ట్‌‌ చేసే విషయంలో లెండర్లపై మరింత కఠినతరమైన నిబంధనలను ఆర్‌‌‌‌బీఐ తీసుకొస్తుండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఎన్పీఏలోనూ ఫ్రాడ్స్​

రూ.50 కోట్లకు పైన ఉన్న ఎన్‌‌పీఐలను కూడా ఫ్రాడ్ కోణంలో దర్యాప్తు చేయాలని బ్యాంక్‌‌లను ఆర్‌‌‌‌బీఐ ఆదేశించింది. చాలా మోసాలు కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే జరిగాయి. కానీ బ్యాంక్‌‌లు మాత్రం ఇప్పుడిప్పుడే వాటిని డిక్లేర్ చేస్తున్నాయి. కార్పొరేట్ ఫ్రాడ్‌‌లను గుర్తించడానికి, రిపోర్టు చేయడానికి ఇండియన్ బ్యాంక్‌‌కు కనీసం 55 నెలల సమయం పట్టిందని ఆర్‌‌‌‌బీఐ డేటా పేర్కొంది. చాలా ఏళ్ల క్రితమే ఎన్‌‌పీఏలు గా మారిన వాటిని, ఇప్పుడు ఫ్రాడ్‌‌గా పేర్కొంటున్నాయని బిగ్‌‌4 కన్సల్టింగ్ కంపెనీ ఫోరెన్సిక్ ఎక్స్‌‌పర్ట్ తెలిపారు. కొన్ని కేసుల్లో ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ప్రారంభించినట్టు చెప్పారు. బ్యాంక్‌‌ మోసాలు ఇంకా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలు నిధులను అనధికారిక అవసరాలకు మరలించడంతో చాలా మోసాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. కొన్ని మోసాలు వ్యాపారాలు పడిపోవడంతో చోటు చేసుకుంటున్నాయన్నారు. వ్యాపారాలు పడిపోవడంతో బ్యాంక్‌‌ బకాయిలను చెల్లించలేకపోతున్నారని పేర్కొన్నాయి.

 

Latest Updates