పుణ్యక్షేత్రాల రైలు వచ్చేస్తోంది.. వచ్చేవారమే పట్టాల మీదకు

    ఇది సూపర్‌‌ఫాస్ట్‌‌ ఏసీ ట్రైన్‌‌

     సకల సదుపాయాలు రెడీ

ఇండియన్‌‌ రైల్వే పబ్లిక్‌‌ సెక్టార్‌‌ యూనిట్‌‌ ఐఆర్‌‌సీటీసీ ప్రవేశపెడుతున్న మరో కార్పొరేట్‌‌ రైలు ఈ నెల 16న పట్టాలెక్కనుంది. ఉత్తరప్రదేశ్‌‌లోని వారణాసి నగరంలో ఈ ప్రైవేటురైలు ప్రారంభోత్సవం జరుగుతుంది. అదే నెల 20వ తేదీ నుంచి ప్రయాణం మొదలవుతుంది. వారణాసి–ఇండోర్‌‌ మధ్య నడిచే ఈ రైలును కాశీ మహాకాల్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌గా పిలుస్తారు. ఇది మూడు ఆధ్యాత్మిక ప్రదేశాలను చుట్టేస్తూ గమ్యస్థానం చేరుకుంటుంది.   ఓంకారేశ్వర్‌‌, మహాకాళేశ్వర్‌‌ మీదుగా ప్రయాణించి కాశీ విశ్వనాథ్‌‌ (వారణాసి) చేరుకుంటుంది. భోపాల్‌‌, ఇండోర్‌‌లు ఎడ్యుకేషన్‌‌ హబ్‌‌లు కాబట్టి ఇది విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే మొదటి ప్రైవేటు/కార్పొరేట్‌‌ రైలు ఇదేనని ఐఆర్‌‌సీటీసీ తెలిపింది. ఈ సూపర్‌‌ఫాస్ట్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌లో ఏసీ సహా సకల సదుపాయాలు ఉంటాయి. ఒక రాత్రిలోనే ఇది గమ్యస్థానం చేరుకుంటుంది. ఇందులో ప్రయాణించే వారికి హైక్వాలిటీ ఫుడ్‌‌, బెడ్‌‌రోల్స్‌‌, హౌస్‌‌ కీపింగ్‌‌ సదుపాయాలు, సెక్యూరిటీ సేవలు అందిస్తారు. రూ.10 లక్షల ప్రమాద బీమా మరో ఆకర్షణ. కాశీ మహాకాల్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌లో ప్రయాణం కోసం 120 రోజులుగా ముందుగానే టికెట్లు బుక్‌‌ చేసుకోవచ్చు.

త్వరలో మరిన్ని ప్రైవేటు రైళ్లు

కాశీ మహాకాల్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ వంటి మరిన్ని  ప్రైవేటు రైళ్లను పట్టాలు ఎక్కించడానికి రైల్వేశాఖ ప్రయత్నాలను వేగవంతం చేసింది. తేజస్ ఎక్స్‌‌ప్రెస్ వంటి మరిన్ని  ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టబోతున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ తాజా బడ్జెట్‌‌లో ప్రకటించడం తెలిసిందే. వీటిని ఎక్కువగా పర్యాటక ప్రాంతాల్లో తిప్పుతామని చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్లు నిర్మించడానికి రూ.12 వేల కోట్లు ఇస్తామని నిర్మల ప్రకటించారు. గేజ్‌‌ మార్పిడికి రూ.2,250 కోట్లు, డబ్లింగ్‌‌ పనులకు రూ.700 కోట్లు, రోలింగ్‌‌ స్టాక్‌‌ కోసం రూ.5,786 కోట్లు, సిగ్నలింగ్‌‌, టెలికాం వసతుల అభివృద్ధికి రూ.1,650 కోట్లు ఇస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 150  ప్రైవేటు రైళ్లను తిప్పాలని ఇండియన్‌‌ రైల్వే కోరుకుంటోంది. పలు అంతర్జాతీయ కంపెనీలు రైల్వే ప్రపోజల్‌‌ను స్వాగతించాయి. అల్‌‌స్టామ్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌, బొంబార్డియన్‌‌, సీమెన్స్‌‌, హ్యుండై రోటమ్‌‌ కంపెనీ, మాకరీ వంటి కంపెనీలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నాయి. టాటా రియల్టీ అండ్‌‌ ఇన్‌‌ఫ్రా, హిటాచీ ఇండియా, ఎస్సెల్‌‌ గ్రూప్స్‌‌, అదానీ పోర్ట్స్‌‌ అండ్‌‌ సెజ్‌‌, ఐఆర్‌‌సీటీసీ వంటి ఇండియన్ కంపెనీలు  ప్రైవేటు రైళ్లను నడపడానికి ఉత్సాహంగా ఉన్నాయి.

ముంబై-–ఢిల్లీ, చెన్నై-–ఢిల్లీ, ఢిల్లీ–-హౌరా, షాలిమార్‌‌-–పుణే, ఢిల్లీ-–పాట్నా మార్గాల్లో  ప్రైవేటు రైళ్లు నడిచే అవకాశాలు ఉన్నాయి. వీటిలో చార్జీలను ఎలా వసూలు చేయాలనే విషయంలో ప్రైవేటు రైలు ఆపరేటర్‌‌/కంపెనీది తుది నిర్ణయం. రైలు కొనడానికి డబ్బు, రవాణా, నిర్వహణ వంటి అన్ని పనులూ ప్రైవేటు కంపెనీలే చేసుకోవాలి.

Latest Updates