కార్పొరేషన్‌‌ బ్యాంక్‌‌కు రూ.130 కోట్ల లాభం

కార్పొరేషన్‌‌ బ్యాంక్‌‌ ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగిసిన రెండో క్వార్టర్‌‌లో రూ.130 కోట్ల లాభం సంపాదించింది. మొండిబాకీలకు ప్రొవిజన్లు తగ్గించడం వల్ల లాభం పెరిగింది. గత ఏడాది క్యూ2లో వచ్చిన లాభం రూ.103.1 కోట్లతో పోలిస్తే ఈసారి ఇది 26 శాతం అదనం. మొత్తం ఆదాయం రూ.4,216 కోట్ల నుంచి రూ.4,712 కోట్లకు పెరిగింది. బ్యాంకు అసెట్‌‌ క్వాలిటీ మెరుగుపడింది. తాజా క్వార్టర్‌‌లో గ్రాస్‌‌ అడ్వాన్సుల్లో మొండిబాకీల వాటా 15.43 శాతానికి పడిపోయింది. గత ఏడాది క్యూ2లో ఇది 17.46 శాతం రికార్డయింది. నికర మొండిబాకీల వాటా 11.65 శాతం నుంచి 5.59 శాతానికి తగ్గింది. దీనివల్ల ప్రొవిజన్లకు, కంటింజెన్సీలకు ప్రొవిజన్లను రూ.789 కోట్లకు పరిమితం చేశారు. గత ఏడాది రెండో క్వార్టర్‌‌లో ప్రొవిజన్లకు రూ.808 కోట్ల నిధులు ఇచ్చారు. ఎన్సీఎల్టీ ఆదేశాల మేరకు అది సూచించిన అకౌంట్ల కోసం అదనంగా ప్రొవిజన్‌‌ చేశామని కార్పొరేషన్ బ్యాంక్‌‌ తెలిపింది. ఇక ప్రొవిజన్‌‌ కవరేజ్‌‌ రేషియో గత క్యూ2లో 65.47 శాతం కాగా, తాజా క్వార్టర్‌‌లో ఇది 83.95 శాతానికి పెరిగింది. ఫలితాల తరువాత కార్పొరేషన్ బ్యాంక్‌‌ షేర్లు బీఎస్‌‌ఈలో 7.25 శాతం పెరిగి రూ.18.50కి చేరాయి.

Latest Updates