మున్సిపాలిటీల్లో అవినీతి జరిగితే ప్రజాప్రతినిధులు బాధ్యులే

corruption-in-municipalities-is-the-responsibility-of-the-public-authorities

హైదరాబాద్‌, వెలుగుమున్సిపాలిటీల్లో అవినీతి జరిగితే అందుకు ప్రజాప్రతినిధులూ బాధ్యులేనని, ఈ మేరకు కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు సీఎం కేసీఆర్​ తెలిపారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఎంత పటిష్టంగా రూపొందించామో, అదేవిధంగా కొత్త మున్సిపల్‌ యాక్ట్‌ తీసుకురానున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్‌ చట్టం అమలు, కొత్త మున్సిపల్‌ చట్టంపై సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా తెచ్చిన పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమలు చేయడానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని, ఇందు కోసం మనసు పెట్టి పనిచేయాల్సి ఉందని సూచించారు. పల్లెల్లో,  మున్సిపాలిటీల్లో చేయడానికి పుష్కలంగా పని ఉందని, దానిని గుర్తించాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో పని వదిలిపెట్టి ఇంకెక్కడో ఏదో చేయాలనుకోవడం నేల విడిచి సాము చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. స్కూళ్లు, కాలేజీల్లో కనీస వసతులు కల్పిచాలని, పల్లెల్లో పచ్చదనం పెంచడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిచాలన్నారు. ఈ బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదేనని సీఎం స్పష్టం చేశారు. పట్టణాలు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న తరుణంలో అక్కడి ప్రజలకు మేలైన పరిపాలన అందించాలని, అందుకే కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. ఇందులో అధికారులను, ప్రజాప్రతినిధులను బాధ్యులనూ చేయబోతున్నట్లు చెప్పారు. మంచికి క్రెడిట్‌‌‌‌ ఎట్లా ఉంటుందో, చెడుకు శిక్ష ఆ విధంగానే ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. మున్సిపల్‌‌‌‌ చట్టాన్ని ఎంత మెరుగ్గా రూపొందిస్తే ప్రజలకు అంత మేలైన సేవలు అందించగలుగుతామన్నారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, కొప్పుల ఈశ్వర్‌‌‌‌, వి.శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates