పత్తి పంటనే ఎక్కువ వేస్తున్నరు

హైదరాబాద్‌, వెలుగు: ఎప్పటి లెక్కనే ఈసారి కూడా రాష్ట్రంలో పత్తి పంటనే ఎక్కువ వేస్తున్నారు. ఇప్పటి వరకు 47.12 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారు. రాష్ట్రంలో సాధారణ పత్తి సాగు 44.50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే ఆ మార్కును దాటేసింది. పోయినేడాది వానలు సరిగా పడకపోవడంతో పత్తి వేసేందుకు రైతులు వెనకడుగు వేశారు. నిరుడు ఈ టైమ్ వరకు 24.27 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగు చేశారు. ఈసారి సీజన్ ప్రారంభంలోనే వానలు పడడంతో రైతులు పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు.

పంట ప్లాన్‌లో 78 శాతం పూర్తి  

ఈ ఏడాది పంట ప్లాన్ లో భాగంగా 60లక్షల16వేల79ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం టార్గెట్‌ విధించింది. ఇప్పటికే 47లక్షల 12వేల 243ఎకరాల్లో సాగు చేశారు. అంటే ప్లాన్‌లో దాదాపు 78శాతం సాగు పూర్తయింది. ఈసారి రికార్డు స్థాయిలో పత్తి సాగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎందుకు ఎక్కువ వేస్తున్నరంటే…

నల్లరేగడి భూములు పత్తి పంటకు అనుకూలం కాగా, ఇప్పుడు రైతులు అన్ని రకాల భూముల్లోనూ పత్తి వేస్తున్నారు. పెసరి, కంది, మక్కలు, జొన్న, సజ్జ లాంటి పంటలు వేస్తే కోతుల బెడద ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు పత్తి వర్షాధారితంగా పండుతుండడంతో ఎక్కువ మంది రైతులు ఈ పంట వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ఈసారి వర్షాలు సకాలంలో రావడంతో ఎక్కువ మంది పత్తి వేస్తున్నారు.

Latest Updates