- కాపాస్ కిసాన్ యాప్‌లో రైతులు ఎంట్రీ చేయించుకుంటే కాంటా
- భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి
కామారెడ్డి, వెలుగు : పత్తి కొనుగోళ్లకు జిల్లాయంత్రాంగం సన్నద్ధమైంది. సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాపాస్ కిసాన్ యాప్‌లో రైతులు తమ వివరాలను ఎంట్రీ చేసుకున్న తర్వాత, సూచించిన తేదీ ప్రకారం సెంటర్‌కు పత్తిని తీసుకెళ్లాలి. సెంటర్ వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌పై అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖల అధికారులు పత్తి రైతులకు అవగాహన కల్పించారు.
కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 27న మద్నూర్లోని జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు సెంటర్ ఏర్పాటు కానుంది. జిల్లాలో అతి భారీ వర్షాల దృష్ట్యా పత్తి పంట కొంత వరకు దెబ్బతిని దిగుబడి తగ్గింది. జిల్లాలో 31,100 ఎకరాల్లో పత్తి సాగు కాగా, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, డొంగ్లీ, పిట్లం, గాంధారి, సదాశివనగర్, రాజంపేట, తాడ్వాయి, కామారెడ్డి, రామారెడ్డి మండలాల్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగైంది. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే పత్తి తెంపటం ప్రారంభించారు.
యాప్‌లో ఎంట్రీ తర్వాతే..
పత్తి అమ్ముకోవాలంటే సెల్ఫోన్లో కాపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రైతులు వివరాలు ఎంట్రీ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ లేనట్లయితే ఏఈవో, ఏవో, మార్కెటింగ్ అధికారులు తమ సిస్టమ్స్‌తో యాప్‌లో ఎంట్రీ చేస్తారు. వివరాలు ఎంట్రీ చేయగానే ఏ జిన్నింగ్ మిల్లులో కాంటాపెడ్తారనే వివరాలు, తేదీ, సమయం కూడా తెలుస్తుంది. ఆ టైంకు పత్తిని తీసుకెళ్లి అమ్మవచ్చు.
రైతులు సెంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. స్లాట్ బుకింగ్ లేకుండా సీసీఐ సెంటర్లో అమ్మటానికి వీలులేదు. 8 శాతం మాత్రమే తేమ ఉండాలని అధికారులు చెబుతున్నారు. క్వాలిటీగా ఉండి, ఆరబెట్టిన పత్తి క్వింటాల్ కు రూ. 8,110 మద్దతు ధర ఉంది.
కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా రైతులకు దూరం
కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల రైతులకు సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సెంటర్ దూరమవుతోంది. ఈ ఏరియాలోని పలు మండలాలకు 80 నుంచి 100 కి.మీ. దూరం కానుంది. జుక్కల్ నియోజకవర్గంలోని రైతులకు మద్నూర్ సెంటర్ దగ్గరవుతుంది. అంత దూరం తీసుకెళ్లలేక తాడ్వాయి, రాజంపేట, సదాశివనగర్, రామారెడ్డి, గాంధారి మండలాల రైతులు ప్రతిసారి దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.
వర్షాలతో దెబ్బతిన్న పంట
జిల్లాలో ఈసారి అభారీ వర్షాలు కురువడంతో పలు మండలాల్లో పత్తి పంట దెబ్బతింది. తాడ్వాయి, రాజంపేట, గాంధారి, సదాశివనగర్ మండలాల్లో పత్తి పంటలో రోజుల తరబడి నీళ్లు నిలిచాయి. దీంతో పంట దిగుబడిపై ప్రభావం చూపనుంది. నిరుడు సగటున ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు వస్తే ఈసారి 8 క్వింటాళ్లు వస్తే గగనమేనని రైతులు పేర్కొంటున్నారు.
సెంటర్లో అమ్మి మద్దతు ధర పొందాలి
పత్తి కొనుగోలుకు ప్రభుత్వం సీసీఐ ఆధ్వర్యంలో మద్నూర్‌లో సెంటర్ ఏర్పాటు చేస్తుంది. రైతులు ఈ సెంటర్లకు పత్తి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి. కాపాస్ కిసాన్ యాప్‌లో వివరాలు ఎంట్రీ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ప్రభుత్వం యాప్‌ను తీసుకొచ్చింది. - రమ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి, కామారెడ్డి
