36 పరుగుల ఆలౌట్ అవమానానికి కౌంటర్

“మిషన్..‌ మెల్‌బోర్న్‌”

సెకండ్‌‌ టెస్టు కోసం రవిశాస్త్రి మాస్టర్‌‌ప్లాన్‌‌

పక్కాగా అమలు చేసిన టీమిండియా: ఫీల్డింగ్‌‌ కోచ్‌‌ ఆర్‌‌. శ్రీధర్‌‌  వెల్లడి

అడిలైడ్‌‌ టెస్టు లో 36 రన్స్‌‌కే కుప్పకూలి ఘోర ఓటమి మూటగట్టుకున్న తర్వాత ఆస్ట్రేలియా టూర్‌‌లో టీమిండియా పనైపోయిందని చాలా మంది అనుకున్నారు. ఆ సిరీస్‌‌లో ఇండియాకు వైట్‌‌వాష్‌‌ తప్పదని అభిప్రాయపడ్డారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేసిన టీమిండియా సిరీస్‌‌ నెగ్గి హిస్టరీ క్రియేట్‌‌ చేసింది..! ఈ అద్భుతానికి కారణం అసాధారణంగా పోరాడిన ఇండియా యంగ్ క్రికెటర్స్‌‌ అయితే దాని వెనకున్న మాస్టర్‌‌మైండ్‌‌ హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రిది. అడిలైడ్‌‌ అవమానం తర్వాత  సెకండ్‌‌ టెస్టులో గెలిచి రేసులో నిలిచేందుకు విరాట్‌‌ కోహ్లీ, అజింక్యా రహానె, ఇతర కోచింగ్‌‌ స్టాఫ్‌‌తో కలిసి శాస్త్రి ‘మిషన్‌‌  మెల్‌‌బోర్న్‌‌’ను క్రియేట్‌‌ చేశారు. శాస్త్రి అండ్‌‌ కో ప్లాన్‌‌ను పక్కాగా అమలు చేసిన టీమ్‌‌ అద్భుతాన్ని ఆవిష్కరించింది..!  ఈ సక్సెస్‌‌లో ఇండియా ఫీల్డింగ్‌‌ కోచ్‌‌, హైదరాబాదీ ఆర్‌‌. శ్రీధర్‌‌ పాత్ర కూడా ఉంది..! అడిలైడ్‌‌ మ్యాచ్‌‌ తర్వాత మిషన్‌‌ మెల్‌‌బోర్న్‌‌  ఎలా మొదలైంది..రవిశాస్త్రి ప్లానింగ్‌‌ ఎలా వర్కౌట్‌‌ అయింది.. ఇండియా ఎలా పుంజుకుందో  శ్రీధర్‌‌ వెల్లడించాడు.  ఆ వివరాలు అతని మాటల్లోనే..

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘అడిలైడ్‌‌ టెస్టు ముగిసిన రోజు రాత్రి 12.30 గంటల సమయంలో ‘ఏం చేస్తున్నారు’ అని విరాట్‌‌ కోహ్లీ నాకు మెసేజ్‌‌ చేయడంతో నేను షాకయ్యా. ఆ టైమ్‌‌లో ఎందుకు మెసేజ్‌‌ చేస్తున్నాడని ఆలోచిస్తూనే ‘నేను, రవిశాస్త్రి, భరత్‌‌ అరుణ్‌‌, విక్రమ్‌‌ రాథోడ్‌‌ కూర్చొని మాట్లాడుతున్నాం’ అని రిప్లై ఇచ్చా. దానికి ‘నేను కూడా మీతో జాయిన్‌‌ అవుతా’ అని కోహ్లీ అనడంతో.. ‘నో ప్రాబ్లమ్‌‌, వచ్చెయ్‌‌’ అని చెప్పా. తను మాతో జాయిన్‌‌ అయ్యాక అందరం డిస్కషన్‌‌ మొదలు పెట్టాం. అక్కడే ‘మిషన్‌‌ మెల్‌‌బోర్న్’ స్టార్ట్‌‌ అయింది. ఆ టైమ్‌‌లో శాస్త్రి ఓ మాట చెప్పారు. ‘ఈ 36 (అడిలైడ్‌‌ సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో స్కోరు)ను మీ చేతికి ఓ బ్యాడ్జీలాగా ధరించండి. ఇదే 36 మనల్ని గ్రేట్‌‌ టీమ్‌‌గా మారుస్తుంది’ అని చెప్పడంతో మేం కొంత కన్ఫ్యూజ్‌‌ అయ్యాం. ఆ తర్వాత మెల్‌‌బోర్న్‌‌ టెస్టులో తీసుకోవాల్సిన డెసిజన్స్‌‌పై చర్చ కొనసాగించాం. తర్వాతి రోజు మార్నింగ్‌‌ కోహ్లీ.. అజింక్యాకు కాల్‌‌ చేసి రాత్రి జరిగిన మీటింగ్‌‌ గురించి చెప్పాడు. సాధారణంగా 36కు ఆలౌటైన తర్వాత ఎవ్వరైనా టీమ్‌‌ బ్యాటింగ్‌‌ బలాన్ని పెంచుతారు. కానీ, రవి, విరాట్‌‌, అజింక్యా బౌలింగ్‌‌ యూనిట్‌‌కు బలం ఇవ్వాలని డిసైడయ్యారు. అందుకే విరాట్‌‌ ప్లేస్‌‌లో రవీంద్ర జడేజాను తీసుకున్నాం. అదే మాస్టర్‌‌ స్ట్రోక్‌‌ అయింది. అలాగే, మెల్‌‌బోర్న్‌‌లో ఎక్కువ మంది లెఫ్టాండర్లు ఉండాలని శాస్త్రి కోరుకున్నారు. రైట్‌‌ హ్యాండ్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ మాత్రమే ఉంటే ఆస్ట్రేలియా బౌలర్లు ఒకే స్పాట్‌‌లో బంతులు విసిరి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని రవి భావించారు. అదే ఇంకో లెఫ్టాండర్‌‌ను తీసుకుంటే వాళ్లు లైన్‌‌ మార్చుకోవాల్సి వస్తుందని, టాక్టికల్‌‌గా ఇది వర్కౌట్‌‌ అవుతుందని అంచనా వేశారు.  ఆ రోజు రాత్రే మేం చాలా నిర్ణయాలు తీసుకున్నాం. సెకండ్‌‌ టెస్టులో అందుబాటులో ఉన్న  ఐదుగురు బెస్ట్‌‌ బౌలర్లతో బరిలోకి దిగాలని డిసైడయ్యాం.

40 నిమిషాల్లోపే  అశ్విన్‌‌ను దింపాలన్నారు..

మెల్‌‌బోర్న్‌‌లో ముగ్గురు ఫాస్ట్‌‌ బౌలర్లతో ఆడాం. ఉమేశ్​, జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా బౌలింగ్‌‌ ఓపెన్‌‌ చేశారు. బుమ్రా స్టార్టింగ్‌‌లోనే జో బర్న్స్‌‌ను ఔట్‌‌ చేశాడు.  ఫస్ట్‌‌ ఛేంజ్‌‌గా అరంగేట్రం బౌలర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌ వస్తాడని అనుకుంటే అజింక్యా 11వ ఓవర్లో అశ్విన్‌‌కు బాల్‌‌ ఇవ్వడంతో  కోచెస్‌‌ బాక్స్‌‌లో కూర్చున్న నేను, అరుణ్‌‌, రాథోడ్​, అనలిస్ట్‌‌ హరి ఆశ్చర్యపోయాం. అప్పుడు రవి మా దగ్గరకు వచ్చి ‘అశ్విన్‌‌ను తొందరగా బౌలింగ్‌‌కు దింపమని జింక్స్‌‌ (అజింక్యా)కు నేనే చెప్పా. స్మిత్‌‌పై తనకు పైచేయి ఉంది. కాబట్టి ఆట మొదలైన 40 నిమిషాల్లోపే అతనికి బాల్‌‌ ఇవ్వాలని సూచించా’ అన్నారు. అశ్విన్‌‌ బౌలింగ్‌‌కు రాగానే ఆయన  క్లాప్స్‌‌ కొడుతున్నారు. ఏదో జరుగుతుందని  ఊహించారు. అశ్విన్‌‌ ఫస్ట్‌‌ బాలే అద్భుతంగా పడగా.. నా హార్ట్‌‌ బీట్‌‌ పెరిగింది. కొద్దిసేపటికే  స్టీవ్‌‌ స్మిత్‌‌ను అశ్విన్‌‌ డకౌట్‌‌ చేశాడు. శాస్త్రి మాస్టర్‌‌ప్లాన్‌‌ వర్కౌట్‌‌ అయింది’’ అని శ్రీధర్‌‌ చెప్పుకొచ్చాడు.

స్మిత్‌‌ వికెట్‌‌ పడడంతో 38/3తో కష్టాల్లో పడ్డ ఆసీస్‌‌ ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 195కే ఆలౌటైంది. ఆ తర్వాత రహానె సెంచరీతో భారీ లీడ్‌‌ సాధించిన ఇండియా టెస్టులో గెలిచి సిరీస్‌‌ రేసులో నిలిచింది. ఆపై, సిడ్నీలో డ్రా చేసుకోవడం.. బ్రిస్బేన్‌‌లో హిస్టారికల్‌‌ విక్టరీతో సిరీస్‌‌ కైవసం చేసుకోవడం అంతా  ఓ అద్భుతంలా సాగింది.

సర్కస్‌‌లో జంతువుల్లా ..

సిడ్నీ, బ్రిస్బేన్‌‌లో టఫ్‌‌ క్వారంటైన్‌‌ రూల్స్‌‌తో ఇబ్బంది పడ్డాం. మేం హోటల్‌‌లో ఉండి అక్కడి నుంచి స్టేడియానికి మాత్రమే వెళ్తున్నాం. కానీ, అక్కడి ప్రజలు చేతిలో బీరు పట్టుకొని, కనీసం మాస్కు కూడా లేకుండా మ్యాచ్‌‌ చూస్తున్నారు. మేం  మాత్రం స్టేడియంలో ఆడి తిరిగి పంజరంలోకి వచ్చేశాం. మమ్మల్ని సర్కస్‌‌లో జంతువుల్లా ట్రీట్‌‌చేశారు.  బ్రిస్బేన్‌‌లో రూమ్‌‌ సర్వీస్‌‌ కూడా లేదు. మూడో రోజుకు గానీ హౌజ్​ కీపింగ్‌‌ వాళ్లను పంపించలేదు.

బ్రేక్‌‌ రావడం వల్లే ఇంజ్యురీలు

ఈ టూర్‌‌లో చాలా మంది ప్లేయర్లు గాయపడడం ఆందోళన కలిగించే విషయమే. కరోనా కారణంగా క్రికెట్‌‌కు బ్రేక్‌‌ రావడంతో ప్లేయర్లకు ఐదు నుంచి ఆరు నెలల పాటు సరైన ప్రాక్టీస్‌‌ లభించలేదు. పైగా, ఆస్ట్రేలియాలో అంత ఇంటెన్సిటీతో ఆడడం అంటే చాలెంజే. దీనికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. దానివల్ల కొందరు ప్లేయర్లు ఫిజికల్‌‌గా, మెంటల్‌‌గా అలసటకు గురయ్యారు. అందుకే గాయపడ్డారు. అలాగే,  ఈ టూర్‌‌లో ఇండియా ఫీల్డర్లు క్యాచ్‌‌లు డ్రాప్‌‌ చేయడంతో నేను  ఆందోళన చెందా. మ్యాచ్​ ఫుటేజ్​లను చూసి చాలా డ్రిల్స్​ చేయించా. ఆసీస్​ ప్లేయర్లు కూడా ఫీల్డింగ్​లో తడబడ్డారు.  అయితే, రహానె, రోహిత్‌‌, జడేజా కొన్ని అద్భుతమైన క్యాచ్‌‌లు పట్టడం చూసి హ్యాపీగా ఫీలయ్యా.

సిరాజ్‌‌కు హాట్సాఫ్‌‌

తన తండ్రి మరణవార్త తెలిసిన  తర్వాత సిరాజ్‌‌ చాలా బాధ పడ్డాడు.  ఆ టైమ్‌‌లో క్వారంటైన్‌‌ రూల్స్‌‌ వల్ల మేం అతని రూమ్‌‌లోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దాంతో, తను సరిగ్గా తింటున్నాడో  లేదో కనుక్కునేందుకు నేను, విహారి రోజు వీడియో కాల్స్‌‌ చేసి మాట్లాడేవాళ్లం. అంత కష్టకాలంలోనూ సిరాజ్​  టీమ్‌‌తోనే ఉండాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. ఇండియాకు ఆడాలని సిరాజ్‌‌ చాలా పట్టుదలగా ఉండేవాడు. రెండేళ్ల నుంచి  ఇండియా–ఎ తరఫున బాగా రాణించినప్పుడల్లా నాకు ఫోన్‌‌ చేసి.. సర్‌‌ నన్నెప్పుడు (ఇండియా టీమ్‌‌లోకి) పిలుస్తున్నారు అనేవాడు. నేనేమో.. నా ఇష్టం వచ్చిన వాళ్లను పిలవడానికి అదేమైనా నా అత్తగారిల్లా.. అని నవ్వుకునేవాడిని. కానీ, తన తండ్రి మరణం తర్వాత సిరాజ్‌‌ చూపించిన నిబ్బరానికి హ్యాట్సాఫ్‌‌.

విహారి బెస్ట్‌‌ ఇచ్చాడు

హనుమ విహారి గత పెర్ఫామెన్స్‌‌లు చూసి ఈ సిరీస్‌‌లో టీమ్‌‌ అతనికి చాన్స్‌‌ ఇచ్చింది. మద్దతుగా నిలిచింది. సిడ్నీలో అత్యంత కీలక దశలో అతను గాయపడ్డాడు. కానీ, ఈ ఇంజ్యురీ తనలోని బెస్ట్‌‌ గేమ్‌‌ను చూపించింది. అశ్విన్‌‌తో కలిసి ఆసీస్‌‌ బౌలింగ్‌‌ను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. సిడ్నీలో ఐదో రోజు ఈ ఇద్దరి పోరాటం బ్రిస్బేన్‌‌ టెస్టుకు ముందు మాలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది.

ఇవి కూడా చదవండి..

సిరాజ్‌ ను ప్రశంసల్లో ముంచెత్తిన టీమిండియా హెడ్​ కోచ్​ రవిశాస్త్రి

ఖాళీ స్టేడియంలోనే తొలి రెండు టెస్ట్‌‌లు

V6 న్యూస్ రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు

Latest Updates