జనాభాను ఇట్ల లెక్కపెట్టాలె

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దేశంలో పదేళ్లకోసారి  జనాభాను లెక్కించే వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే టైమొచ్చింది. 2021లో నిర్వహించే జనాభా లెక్కలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ.. అధికారులు ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నలుగురు మాస్టర్‌‌‌‌ ట్రైనర్లకు అవగాహన కల్పించారు. ఒక్కో మండలం నుంచి ఎంపికైన ముగ్గురికి ఈ మాస్టర్‌‌‌‌ ట్రైనర్లు జనవరిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ముగ్గురు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ఎన్యూమరేటర్లకు ట్రైనింగ్‌‌‌‌ ఇస్తారు. ఇదంతా జనవరి, ఫిబ్రవరిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 2011లో జనాభా లెక్కలు నిర్వహించారు. ఈ లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీ జనాభా 8,45,80,777గా తేలగా, ఇందులో తెలంగాణ జనాభా 3,50,03,674గా నమోదైంది. తెలంగాణ ఏర్పాటయ్యాక నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3,63,03,012గా తేలింది. కాగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా జనాభా లెక్కలు నిర్వహించబోతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా తొలుత  ప్రజలు నివసించే ప్రతి నివాసం గోడపై ఒక నంబర్‌‌‌‌ వేస్తారు. ఆ తర్వాత150 ఇళ్లను ఒక బ్లాకుగా విభజిస్తారు. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు కూడా నంబర్‌‌‌‌ వేస్తారు. ఈ ప్రక్రియను 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌‌‌‌ వరకు పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఎన్యుమరేటర్లు 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు సేకరిస్తారు. ఇందులో ఏ ఒక్క ఇంటిని వదలకుండా జనగణన పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి రోజు అర్ధరాత్రి 12 గంటలకు దేశవ్యాప్తంగా నివాసం లేకుండా ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై, రోడ్లపై, గుడారాల్లో జీవనం సాగించే సంచార జాతులవారిని లెక్కిస్తారు.

 

Latest Updates