డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి : మంత్రికి మూడు నెలల జైలు శిక్ష

పోలీసులపై దాడి చేసిన ఎనిమిదేళ్ల తరువాత మహారాష్ట్ర మంత్రి యశోమతి ఠాకూర్‌కు మూడు నెలల కఠిన జైలు శిక్ష,రూ.15,500 జరిమానా విధిస్తూ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో  శిశు అభివృద్ధి శాఖ మంత్రి యశోమతి ఠాకూర్‌ తో పాటు మరో ముగ్గురిని జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఉర్మిలా జోషి దోషులుగా నిర్ధారించారు. వారికి మూడు నెలల కఠినమైన జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మంత్రితో పాటు మిగిలిన దోషులు అదనంగా ఒక నెల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.

2012 మార్చి 24 సాయంత్రం 4.15 గంటల సమయంలో అమరావతిలోని రాజపేత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చునభట్టి ప్రాంతంలో నాటి ఎమ్మెల్యే ఠాకూర్ ఓ కాలనీలో వన్ వే లో వెళుతుండగా పోలీసులు రోడ్డు బాగలేదని, వెనక్కి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఠాకూర్ ఆమె అనుచరులు డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిపై కేసు నమోదైంది. ఈకేసు ఎనిమిదేళ్లుగా విచారణ కొనసాగుతుండగా తాజాగా డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడిచేసినందుకు ప్రస్తుతం మహరాష్ట్ర మంత్రి యశోమతి ఠాకూర్ కు జైలు శిక్ష విధిస్తూ జిల్లా మహిళా కోర్ట్ తీర్పిచ్చింది. ఈ తీర్పుపై మంత్రి యశోమతి మాట్లాడుతూ వృత్తిరిత్యా తాను న్యాయవాదినని, న్యాయం కోసం హైకోర్ట్ కు వెళుతున్నట్లు స్పష్టం చేశారు.

Latest Updates