ఆ ఫ్యామిలీకి పరిహారమివ్వండి

వెలుగు: పాలసీదారుడి అనారోగ్యానికి సంబంధించి కేస్‌ షీట్‌ను ఆధారంగా చూపి బీమా డబ్బులు ఇచ్చేది లేదంటే కుదరదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ శనివారం స్పష్టం చేసింది. మృతుడి కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని బిర్లా సన్‌ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌ మండలం స్వరూప్ నగర్ కు చెందిన ఎంవీ లక్ష్మీరమణ 2012 మార్చి 31న బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో పాలసీ తీసుకున్నారు. నెలకు రూ.6,651 చొప్పున 30 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అదే ఏడాది ఏప్రిల్‌ 25న నంద్యాలలో అస్వస్థతకు గురై లక్ష్మీరమణ హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ కేర్‌ హాస్పిటల్ చికిత్స పొందుతూ మే 6న చనిపోయారు. స్వైన్‌ఫ్లూ తో మరణించినట్లు డాక్టర్లు నిర్ధరించారు.

మృతుడి భార్య సంగీత బీమా క్లేమ్ కోసం దరఖాస్తు చేయగా కంపెనీ తిరస్కరించింది. దీంతో ఆమె హైదరాబాద్‌ జిల్లా ఫోరం–3లో అప్పీలు చేసింది. కేర్‌ హాస్పి టల్‌ కేస్ షీట్ లక్ష్మీరమణకు పదేళ్ల నుంచి రక్తానికి సంబంధించిన వ్యాధి ఉన్నట్లు నమోదు చేశారని, పాలసీ తీసుకునే సమయంలో ఆ విషయాన్ని దాచిపెట్టారని ఇన్సూరెన్స్‌ కంపెనీ వాదించింది. కేస్‌ షీట్ ఉంటే సరిపోదని, రిపోర్టులు చూపాలని జిల్లా ఫోరం ఆదేశించింది. ఆధారాలు చూపకపోవడంతో మృతుడి కుటుంబానికి రూ.15 లక్షలతోపాటు రూ.2 లక్షల పరిహారం, రూ.3 వేలు కోర్టు ఖర్చులను 30 రోజుల్లో చెల్లించాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీ స్టేట్‌ ఫోరంను ఆశ్రయించింది. రూ.2 లక్షల పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, రూ.15 లక్షలకు మాత్రం 2016 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 9 శాతం వడ్డీతో చెల్లించాలని, రూ.3 వేలు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఫోరం ఆదేశించింది.

Latest Updates