15 రోజులే అమర్​నాథ్ యాత్ర.. జులై 21 నుంచి షురూ

జమ్మూ: అమర్‌నాథ్ యాత్ర జూలై 21 నుంచి ప్రారంభం కానుందని అధికార వర్గాలు ప్రకటించాయి. ఆగస్టు 3 తో ముగుస్తుందని తెలిపాయి. జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం ఈ సారి కేవలం 15 రోజులు మాత్రమే తెరిచి ఉంటుందని ఆలయ అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. యాత్రకు సంబంధించిన మొదటి పూజ ‘ప్రథం పూజ’ శుక్రవారం నిర్వహించారు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈసారి యాత్ర కాలం తగ్గించామన్నారు. కరోనా ఎఫెక్టు నేపథ్యంలో ఆలయాన్ని సందర్శించేవారికి అధికారులు కండిషన్లు పెట్టారు. 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యాత్రికులను మాత్రమే అనుమతిస్తామని, యాత్రకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుందని చెప్పారు. భక్తులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. సాధువులకు ఈ నిబంధనలు వర్తించవన్నారు. కాశ్మీర్ లోకి ప్రవేశించేముందే అందరికీ టెస్టులు నిర్వహిస్తామన్నారు. 15 రోజులపాటు అమర్ నాత్ టెంపుల్ లో జరిగే హారతి కార్యక్రమాన్ని భక్తుల దర్శనార్థం లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు.

బేస్ క్యాంప్ నుంచి గుహ మందిరం వరకు ట్రాక్ నిర్వహణలో ఇబ్బందులు ఉన్నందున, గాండెర్బల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి గుహ మందిరం వరకు హెలికాప్టర్లను ఉపయోగించి యాత్ర నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కేవలం ఉత్తర కాశ్మీర్ బల్తాల్ మార్గం ద్వారా మాత్రమే యాత్ర నిర్వహిస్తామని, పహల్గాం మార్గం ద్వారా ఈ సంవత్సరం యాత్ర చేపట్టడానికి ఏ యాత్రికుడిని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. రక్షా బంధన్ పండుగతో సమానమైన శ్రావణ పూర్ణిమ ఆగస్టు 3 న యాత్ర ముగుస్తుందని చెప్పారు.

Latest Updates