కార్ల అమ్మకాలకు కరోనా కష్టాలు

మళ్లీ తగ్గిన సేల్స్

లిక్విడిటీ సంక్షోభానికి తోడు కరోనా కష్టాలు

రికవరీకి మరో మూడు, నాలుగేళ్లు

న్యూఢిల్లీ : దేశంలో హోల్‌‌సేల్ ప్యాసెంజర్ వెహికల్స్ అమ్మకాలు జూన్‌‌ నెలలో 49.59 శాతం పడిపోయి 1,05,617 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఎకనమిక్ స్లోడౌన్‌‌తో దేశీయంగా వెహికల్స్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. కొనేవాళ్లే కరువయ్యారు. దీంత ఆటో కంపెనీలు మస్తు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అంతేకాక కరోనా వైరస్ కారణంతో సప్లయి చెయిన్‌‌లో అవాంతరాలు ఎదురై, మాన్యు ఫాక్చరింగ్‌‌ను పెంచడానికి ఆటో కంపెనీలు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యు ఫాక్చరర్స్(సియామ్) వెల్లడించింది.

ఫ్యాక్టరీల నుంచి మార్కెట్‌‌లోకి వచ్చిన ప్యాసెంజర్ కార్లు 57.98 శాతం తగ్గి 55,497 యూనిట్లుగా ఉన్నాయి. అదేవిధంగా యుటిలిటీ వెహికల్స్ 31.16 శాతం తగ్గి 46,201 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్ చెప్పింది. ఫ్యాక్టరీల నుంచి బయటికి వచ్చిన వెహికల్స్‌ను పరిగణనలోకి తీసుకునే ఆటోమొబైల్ సేల్స్‌‌ను లెక్కిస్తారు. రిటైల్ సేల్స్‌‌ను పరిగణలోకి తీసుకోరు. కరోనా లాక్‌‌డౌన్‌‌ను ఎత్తి వేసిన తర్వాత, రిటైల్ సేల్స్ పుంజుకున్నాయని, ఈ డిమాండ్‌‌ను అందుకోవడానికి కంపెనీలు ప్రొడక్షన్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు సియామ్ చెప్పింది. కరోనా వైరస్ కారణంతో ఫ్యాక్టరీలలో పనిచేసే మాన్‌‌పవర్ తగ్గిపోయింది. దీంతో ప్రొడక్షన్‌‌ పెంచడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే లిక్విడిటీ సంక్షోభం, తగ్గిపోయిన కంన్జంప్షన్ డిమాండ్‌‌తో ఏడాదిన్నరగా ఇబ్బంది పడుతోన్న ఆటో సెక్టార్ కరోనా కొత్త కష్టాలను తెచ్చింది. అన్ని కేటగిరీల్లో సేల్స్‌‌పై ఇది ప్రభావం చూపింది. వెహికల్ సేల్స్ 2018 స్థాయిలను అందుకోవాలంటే ఆటో మొబైల్ ఇండస్ట్రీకి మరో మూడు లేదా నాలుగేళ్లు పట్టొచ్చని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వాధేరా చెప్పారు. లాభాల్లో నడిచే చాలా కంపెనీలు కూడా ఇప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. ‘భారత్ స్టేజ్ 6 ఎమిషన్ నార్మ్స్‌‌లోకి మారేందుకు కంపెనీలు పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేశాయి. సప్లయి చెయిన్ నెట్‌‌వర్క్‌‌లో చాలా సమస్యలే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఇంకా కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. చాలా మంది వర్కర్లు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో మాన్‌‌పవర్ సమస్యలున్నాయి. సప్లయి కూడా అతిపెద్ద సవాలుగా ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో, చాలా కంపెనీల ఫ్యాక్టరీల్లో ప్రొడక్షన్‌‌కు దెబ్బపడుతోంది. గతేడాది ఇదే క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే డిమాండ్ కేవలం 40–50 శాతమే ఉంది’ అని వాధేరా చెప్పారు.

టూవీలర్ సెగ్మెంట్‌‌లో స్కూటర్ సేల్స్ 47.37 శాతం తగ్గి 2,69,811 యూనిట్లుగా నమోదయ్యాయి. మోటార్ సైకిల్స్‌‌ 35.19 శాతం పడిపోయి 7,02,970 యూనిట్లుగా రికార్డయ్యాయి. మొత్తంగా టూవీలర్ సేల్స్ 38.56 శాతం తగ్గి 10,13,431 యూనిట్లుగా ఉన్నట్టు తెలిసింది. రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో డిమాండ్ రికవరీ అయి, టూవీలర్ సేల్స్ పుంజుకుంటున్నాయని సియామ్ డేటాలో వెల్లడైంది. అయితే ఈ నెలకు సంబంధించిన కమర్షియల్ వెహికిల్ డేటాను సియామ్ అందించలేదు.

ఆటో సెక్టార్‌‌‌‌లో లాంగెస్ట్ స్లోడౌన్..

వరుసగా తొమ్మిదో క్వార్టర్‌‌‌‌లో కూడా ప్యాసెంజర్ వెహికల్(పీవీ) సేల్స్ పడిపోయాయి. 2020 ఏప్రిల్ –జూన్ మధ్య కాలంలో పీవీ సేల్స్ 78.43 శాతం తగ్గిపోయి 1,53,734 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో పీవీ సేల్స్ 7,12,684 యూనిట్లుగాఉన్నాయి. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌‌లో కూడా సేల్స్ 84.81 శాతం తగ్గిపోయినట్టు సియామ్ ప్రకటించింది. గత 20 ఏళ్లలో ఇదే లాంగెస్ట్ స్లోడౌన్ అని సియామ్ చెప్పింది. టూవీలర్ సేల్స్ కూడా ఈ క్వార్టర్‌‌‌‌లో 12,93,113 యూనిట్లకు తగ్గిపోయాయి. గతేడాది ఇదే క్వార్టర్‌‌‌‌లో సేల్స్ 50,13,067 యూనిట్లుగా ఉన్నాయి. అంటే 74.21 శాతం మేర టూవీలర్ సేల్స్ పడిపోయాయి. త్రీ వీలర్ సేల్స్ కూడా 1,49,797 యూనిట్ల నుంచి 12,760 యూనిట్లకు తగ్గిపోయాయి. త్రీవీలర్ సేల్స్ 91.48 శాతం పడిపోయినట్టు సియామ్ చెప్పింది.

Latest Updates