మే 3 త‌ర్వాత కూడా లాక్ డౌన్ త‌ప్ప‌దు.. రాష్ట్రాల బోర్డ‌ర్స్ క్లోజ్

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం మే 3 త‌ర్వాత కూడా లాక్ డౌన్ కొన‌సాగించ‌డం త‌ప్ప‌నిస‌రి అని అభిప్రాయ‌ప‌డ్డారు గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్. అయితే ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు కొంత వెసులుబాటు క‌ల్పించాల‌ని అన్నారు. సోమ‌వారం ఉద‌యం అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆ స‌మావేశంలో పాల్గొన్న ప్ర‌మోద్ సావంత్.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం గోవాలో అనుస‌రిస్తున్న విధానాల‌ను వివ‌రించారు. ఈ భేటీ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మ‌రికొన్నాళ్ల పాటు దేశంలో లాక్ డౌన్ పొడిగించాల‌ని తాను మోడీని కోరిన‌ట్లు చెప్పారు. త‌న‌తో పాటు మ‌రికొన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఇదే డిమాండ్ చేశార‌ని తెలిపారు. రాష్ట్రాల మ‌ధ్య బోర్డ‌ర్స్ పూర్తిగా మూసేయాల‌ని, ఇత‌ర ప్రాంతాల‌కు వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌కుండా క‌ట్ట‌డి చేయాల‌ని అన్నారు‌. విమానాలు, రైలు ప్ర‌యాణాల‌ను ఇప్పుడే ప్రారంభించ‌డం మంచిది కాద‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అయితే ఆయా రాష్ట్రాల ప‌రిధిలో ఎక‌న‌మిక్ యాక్టివిటీకి అనుమ‌తి ఇవ్వాల‌ని ప్ర‌ధానిని కోరిన‌ట్లు చెప్పారు గోవా సీఎం ప్రమోద్ సావంత్.

దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 28 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 8 వేల పైచిలుకు కేసులున్నాయి. ఆ రాష్ట్రాన్ని అనుకుని ఉన్న గోవాలో ఏడుగురు వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇప్ప‌టికే వారంతా పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Latest Updates