కరోనాతో కరువు..20 కోట్ల మందికి తిండి ఉండదు

లండన్​:  ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన కరోనా.. ఇప్పుడు కరువులనూ మోసుకొస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో అతి తీవ్రమైన కరువులు విరుచుకుపడతాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ వరల్డ్​ ఫుడ్​ ప్రోగ్రామ్​ (డబ్ల్యూఎఫ్​పీ) హెచ్చరించింది. కరోనా కరువులపై సంస్థ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ డేవిడ్​ బేస్లీ యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​తో వీడియో కాన్ఫరెన్స్​ సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. గతంలో వెల్లడించిన ఆకలి బాధితుల సంఖ్యను ఇప్పుడు రెట్టింపు చేశారు. మహమ్మారి వల్ల వచ్చే ఆ కరువు అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ‘మనకు కాలం కలిసి రావట్లేదు’ అని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత తీవ్రమైన కరువు ఇదేనన్నారు. 56 దేశాలపై కరువు పంజా విసురుతుందని చెప్పారు. 26.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తారని చెప్పారు. పోయిన వారం డబ్ల్యూఎఫ్​పీ కరువు పరిస్థితిపై ఓ రిపోర్టు ఇచ్చింది. అందులో 13.5 కోట్ల మంది కరువుకు బాధితులవుతారని సంస్థ చెప్పగా, ఇప్పుడు ఆ సంఖ్యను దాదాపు రెట్టింపు చేసింది.

10 దేశాల్లో మరింత కష్టం

రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ మార్పులతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పది పేద దేశాలపై ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని బేస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. యెమన్​, డెమొక్రటిక్​ రిపబ్లిక్​ ఆఫ్​ కాంగో, ఆఫ్గనిస్థాన్​, వెనెజులా, ఇథియోపియా, సౌత్​సూడాన్​, సూడాన్​, సిరియా, నైజీరియా, హైతీల్లో పది లక్షల మంది ఇప్పటికే ఎఫెక్ట్​ అయ్యారని, ఆ సంఖ్య మున్ముందు మరింత పెరుగుతుందని చెప్పారు. గత ఏడాది ఒక్క సౌత్​సూడాన్​లోనే 61 శాతం మంది ఆకలితో అలమటించారని గుర్తు చేశారు. మహమ్మారి ఎటాక్​ చేయడానికి ముందు నుంచే తూర్పు ఆఫ్రికా, దక్షిణాసియాల్లో ప్రకృతి కారణంగా వచ్చిన కరువు, మిడతల దాడి వల్ల తిండికి కొరత ఏర్పడిందని, దానికి ఇప్పుడు కరోనా తోడైందని అన్నారు. కాబట్టి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు తెలివిగా, వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Latest Updates