కరోనా కేసులు పెరుగుతున్నా పట్టించుకోని గ్రామీణ భారతం!!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. అయినా కరోనా సోకుతుందేమోనన్న భయం ప్రజల్లో రావడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ.. ప్రజల్లో కరోనాపై భయం తగ్గిందని తెలుస్తోంది. రూరల్ ప్రాంతాల్లో మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించకపోవడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. అస్సాంలోని బైహటా చరియాలి అనే చిన్న టౌన్‌లో ఉండే హర్మహన్ డెకాకు కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ బిజినెస్ ఉంది. అతడి వద్ద 25 మంది పురుష, మహిళా వర్కర్స్ పని చేస్తుంటారు. అయితే కరోనా బారిన పడకుండా ఉండేందుకు డెకా మాస్కు కట్టుకోడు. ఇతరులకు దూరంగా సోషల్ డిస్టెన్సింగ్‌ను కూడా పాటించకపోవడం గమనార్హం. దీని గురించి అతడు చెప్పిన మాటలు విస్మయం కలిగించకమానవు. ‘వైరస్ నాపై దాడి చేయదు. అది బలహీనపడింది. పొరుగున ఉన్న కిరాణా కొట్టు ఓనర్‌‌తో తరచుగా సమావేశమవుతా. అది కూడా మాస్కులు లేకుండా. అయినా నేను, ఆ షాప్ యజమాని ఇద్దరం బాగున్నాం. బహుశా లక్షణాలు లేని కరోనాను మేం కలిగున్నామేమో’ అని డెకా చెప్పాడు.

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ రూరల్ ఇండియాలో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేతో కరోనా పై గ్రామీణ భారతీయుల ఆలోచనల్లో మార్పులు వచ్చినట్లు స్పష్టమవుతోంది. మన దేశంలో మూడింట రెండొంతుల మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తారనేది తెలిసిందే. వీరిలో మెజారిటీ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవనేది విస్పష్టమైన నిజం. ఈ నేపథ్యంలో కరోనా లాంటి మహమ్మారి గ్రామాల్లో విజృంభిస్తే వచ్చే ప్రాణ నష్టం భారీస్థాయిలో ఉండొచ్చని ఎక్స్‌పర్ట్స్‌ హెచ్చరిస్తున్నారు.

‘కొన్నిసార్లు ప్రజలు దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాం, తాజా కాయగూరలు తింటున్నాం కాబట్టి అలా వ్యవహరిస్తారు. రూరల్ ఏరియాల్లో ఆరోగ్య సదుపాయాలు కొరత ఎక్కువగా ఉంది. అందుకే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు కట్టుకోవడాన్ని వాళ్లు తప్పనిసరిగా పాటించాలి. జన సంచారం ఎక్కువగా ఉండే చోట్లకు వెళ్లడాన్ని తగ్గించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే వాళ్లకు ఇబ్బందులు తప్పవు’ అని ఇండియన్ మెడికల్ రీసెర్చ్‌లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ మెంబర్‌‌గా ఉన్న రజనీకాంత్ చెప్పారు.

Latest Updates