
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో హెల్త్ కేర్ వర్కర్లకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ హెల్త్ ఆఫీసర్లకు సమాచారం అందింది. తొలి దశలో 3 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లు, 2 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల ఏడో తేదీన అన్ని రాష్ర్టాల హెల్త్ మినిస్టర్లతో, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే వ్యాక్సినేషన్ తేదీని ప్రకటించనున్నారు. ఈ నెల 10వ తేదీ కల్లా వ్యాక్సిన్ డోసులు పుణే నుంచి హైదరాబాద్ వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశలో రాష్ర్టవ్యాప్తంగా 1,500 సెంటర్లలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో ఎక్కువగా ప్రభుత్వ దవాఖాన్లు ఉండగా కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హెల్త్ వర్కర్ల పూర్తి వివరాలను కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేశారు. వారంలో పోలీసులు, శానిటేషన్, మున్సిపల్ సిబ్బంది వివరాలనూ అప్లోడ్ చేయనున్నారు. సాఫ్ట్‌వేర్‌లో పేరు నమోదు చేసుకున్న వారికే తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.