భూమా అఖిల ప్రియ అరెస్ట్.. ఎవ్వరినీ వదలం

హైదరాబాద్: హఫీజ్ పేటలో ఏడాదిగా కొనసాగుతున్న భూవివాదం కారణంగానే సికింద్రాబాద్, బోయిన్ పల్లిలో కిడ్నాప్ జరిగిందని తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. ఈ కేసులో ఏ1గా సుబ్బారెడ్డి, ఏ2గా భూమా అఖిలప్రియ, ఏ3గా ఆమె భర్త భార్గవరామ్ పేర్లు చేర్చినట్టు చెప్పారు. ఏపీకి తెలంగాణ పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని.. మరింత మందిని అరెస్ట్ చేస్తామన్నారు. తప్పు ఏ స్థాయి వ్యక్తులు చేసినా వారిని వదిలిపెట్టేది లేదన్నారు సీపీ. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 10 మంది బోయిన్ పల్లిలోని ప్రవీణ్ రావు ఇంటికి వెళ్లారని.. ఒకరు ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ అని చెప్పుకుని వెళ్లారన్నారు. ఫేక్ ఐడీ కార్డుతో వెళ్లిన వాళ్లు.. ఇంట్లోవారందరినీ ఒక రూమ్ లో లాక్ చేసి, ముగ్గురిని కిడ్నాప్ చేశారన్నారు. ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె భర్త బార్గవ రామ్ కు ప్రమేయం ఉందని తేలిందన్నారు.

మొత్తం 15 బృందాలు రంగంలోకి దిగాయని..  కూకట్ పల్లిలోని ఆమె నివాసంలో అఖిల ప్రియను అదుపులో తీసుకున్నామని..ప్రస్తుతం అఖిల ప్రియ పోలీసుల కస్టడీలో గాంధీ హాస్పిటల్ లో మెడికల్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే మరికొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి మంగళవారం రాత్రి 10 గంటలకి డయల్ 100కి కాల్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకున్నారని తెలిపారు. కిడ్నాప్ జరిగిన 3 గంటల్లోనే కేసును ఛేదించామని.. నార్సింగ్ లో కిడ్నాప్ చేసిన ముగ్గురిని వదిలివెళ్లారన్నారు. కిడ్నాప్ కు గురైన వ్యక్తులను ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని.. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అఖిల ప్రియ భర్తకు ఈ కేసులో ఎక్కువ సంబంధం ఉందన్నారు. గత సంవత్సరం కూడా ఇదే భూమి విషయంలో కేసు నమోదైనట్లు తెలిపారు సీపీ అంజనీకుమార్.

Latest Updates