అవంతి ఇంటి దగ్గర 24 గంటల సెక్యూరిటీ

హైదరాబాద్: హేమంత్ హత్య విషయంలో.. తనకు ప్రాణహాని ఉందని ఆయన భార్య అవంతి ఇప్పటికే పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అవంతి, హేమంత్ కుటుంబ సభ్యులు బుధవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ ‌ను కూడా కలిశారు. తమకు భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. హేమంత్ హత్యపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని అవంతి సీపీని కోరారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూడాలని అన్నారు. ఈ క్రమంలోనే అవంతి విజ్ఞప్తిపై సీపీ సజ్జనార్ స్పందించారు. ఎలాంటి భద్రతైనా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వెంటనే హేమంత్ ఇంటి దగ్గర 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. అలాగే ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు సీపీ.

హేమంత్ హత్య కేసులో నిందితులను పోలీసులు కష్టడీలోకి తీసుకున్నారు. బుధవారం చర్లపల్లి జైలు నుంచి యుగంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలను గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు. హేమంత్ హత్యకు సంబంధించి లోతైన విచారణ చేయనున్నారు. ఇప్పటికే అవంతి, హేమంత్ కుటుంబ సభ్యుల స్టేట్‌ మెంట్‌ లను పోలీసులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే.

Latest Updates